Begin typing your search above and press return to search.

శాస్త్రి తాష్కెంట్ వెళ్లినప్పుడు నేతాజీ ఉన్నారా?

By:  Tupaki Desk   |   14 Dec 2015 5:51 AM GMT
శాస్త్రి తాష్కెంట్ వెళ్లినప్పుడు నేతాజీ ఉన్నారా?
X
తాజాగా ఒక ఫోటో కొత్త కలకలాన్ని రేపుతోంది. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత మిస్టిరీయస్ నేతగా చెప్పుకునే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన చాలానే అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కొత్త కొత్త ప్రశ్నల్ని తెరపైకి తీసుకొస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో నేతాజీ మరణించారని చెబుతుంటే.. అలాంటిదేమీ లేదు.. ఆ తర్వాత రష్యాలో ఉన్నారంటూ చాలానే వాదనలు వినిపిస్తాయి. అయితే.. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ఫోటో వెలుగులోకి రావటం.. అందులో నేతాజీని పోలిన వ్యక్తి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రా రష్యాలోని తాష్కెంట్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో.. అక్కడి వారితో కరచాలనం చేసే సమయంలో ఒక ఫోటో తీశారు. ఇప్పుడు ఆ ఫోటో ఒక పెద్ద చర్చగా మారింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పోలికలు ఉండటం ఇప్పుడు సందేహంగా మారింది. బ్రిటన్ కు చెందిన ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ నిపుణుడు నీల్ మిల్లర్ ప్రకారం లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ పర్యటన సందర్భంగా తీసిన ఫోటోలో ఆయనకు కాస్త వెనుక ఉన్న వ్యక్తి నేతాజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఫోటోలో ఉన్న వ్యక్తి నేతాజీనా? కాదా? అన్న విషయాన్ని తేల్చాల్సిందిగా మిల్లర్ కు.. మిషన్ నేతాజీ మాజీ సభ్యుడైన సిద్ధార్త సత్ఫాయ్ ఫోటోల్ని ఇవ్వటం.. ఆయన దానిపై నిశితంగా పరిశోధనలు జరిపి.. ఫోటోలో కనిపిస్తున్న నేతాజీ ఒకటయ్యే అవకాశం భారీగా ఉందని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమేకాదు.. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారినట్లేనని చెప్పక తప్పదు. వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని మోడీ రష్యాకు వెళ్లనున్న నేపథ్యంలో నేతాజీకి సంబంధించిన రహస్య పైళ్లతో పాటు.. వాటి వివరాల్ని రష్యా బయటపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి.. ఈ అంశంపై తనకు తెలిసిన రహస్యాల్ని రష్యా బయట పెడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.