Begin typing your search above and press return to search.

బీసీల నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ

By:  Tupaki Desk   |   2 May 2022 4:55 AM GMT
బీసీల నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ
X
ఎక్సక్లూజివ్ గా బీసీల కోసమే కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. ఇప్పుడున్న పార్టీలు బీసీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న కారణంగానే కొత్తగా తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. అంటే ఇంతకాలం బీసీల సంక్షేమం కోసమే పాటుపడిన సంఘం ఆధ్వర్యంలో తొందరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటవ్వబోతుండటం గమనార్హం.

బీసీలకు ప్రత్యేకంగా ఒక పార్టీ ఉండాలనే చర్చ, డిమాండ్ బీసీ నేతల్లో కొంతకాలంగా వినబడుతోంది. తాజాగా గుంటూరులో జరిగిన బీసీ సంక్షేమ సంఘాలు, బీసీ కులాల ప్రతినిధుల

కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులందరు బీసీల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఉండాల్సిందే అని తీర్మానం జరిగింది. దాంతో ప్రత్యేకంగా ఒక పార్టీని తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు కేశన ప్రకటించారు.

తొందరలోనే వివిధ జిల్లాల్లోని బీసీల సంఘాల ప్రతినిధులు, యాక్టివిస్టులు లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహణకు నిర్ణయం జరిగింది. భవిష్యత్తులో బీసీలకోసం ఏర్పడబోయే పార్టీ బలంగా తయారవుతుందని కేశన చెప్పారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో ఇతర సామాజికవర్గాలకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీసీలకు ఇతర పార్టీలు టికెట్లు కేటాయించటం కాదని బీసీల కోసం ఏర్పాటవబోయే పార్టీయే ఇతర సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించబోతున్నట్లు శంకరరావు చెప్పారు.

సరే కేశన చెప్పింది ఎంతవరకు వాస్తవంలోకి వస్తుందన్నది వేరే ప్రశ్న. ఎందుకంటే కుల సంఘాల తరపున గతంలో కూడా కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసినా ఎవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. కులసంఘాలను రాజకీయ పార్టీలు గా మార్చటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని తేలింది.

ఎందుకంటే ఒక రాజకీయపార్టీ పెట్టాలన్నా, దాన్ని నడపాలన్నా మామూలు విషయం కాదు. గతంలో కూడా చాలా పార్టీలు పెట్టి చాలావాటిని మూసేశారు. ఉన్న అరాకొరా పార్టీలు కేవలం లెటర్ హెడ్లకు మాత్రమే పరిమితమైపోయాయి. కాబట్టి గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని కేశన శంకరరావు ముందడుగు వేయకపోతే బీసీ సంక్షేమ సంఘమే దెబ్బతింటుంది.