Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త తరహా రాజకీయం మునుగోడులో

By:  Tupaki Desk   |   20 Aug 2022 6:43 AM GMT
ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త తరహా రాజకీయం మునుగోడులో
X
రాజకీయం కొత్త ముఖాల్లోకి మారుతోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఔరా అని అవాక్కు అవ్వాల్సిందే. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కొన్ని పార్టీలు సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికలు అన్నంతనే.. ప్రధాన పార్టీల్లోని వారు పార్టీలు మారటం.. వెళ్లే వాళ్లు వెళ్లిపోతే.. వచ్చే వారు వస్తూ ఉంటారు.

దీని కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు తెర వెనుక జోరుగా సాగుతుంటాయి. అయితే.. కొందరికి ఉన్న పార్టీలో ఉండలేని పరిస్థితి. అదే సమయంలో వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్య తీర్చేందుకు సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

తాజాగా మునుగోడులో ప్రత్యర్థి పార్టీల్ని దెబ్బ తీసేందుకు కొత్త తరహా ప్లానింగ్ అమల్లోకి వచ్చింది. గెలుపు కీలకమైన వేళ.. ఆ దిశగా వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్న ఆలోచనలో ఉన్న పార్టీలు.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నేతలకు గాలం వేస్తోంది. అదే సమయంలో.. వారిని వారి పార్టీలోనే ఉంచేసి.. తమ పార్టీ తరఫున పని చేయాలని కోరుతున్నారు. ఇదంతా గుట్టుగా చేయాలని.. అందుకు తగ్గ నజరానాను భారీగా అందజేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

మనుగోడు నియోజకవర్గంలోని మునుగోడు.. చండూరు.. మర్రిగూడ..నాంపల్లి మండలాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. అయితే.. కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పెద్దగా కనిపించకుండా ఉండటానికి వీలుగా వారికి ఖరీదైన బహుమతులు.. నగదు ఇచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాదు.. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఏదైనా యాత్రలకు వెళ్లేందుకు సిద్ధమైతే.. అందుకు తగ్గ ఖర్చును పెట్టుకునేందుకు సైతం ప్రత్యర్థి పార్టీలు సిద్ధమవుతున్నాయి. కుటుంబంతో పాటు వెళ్లాలనుకున్నా వెళ్లాలని.. తాము అండగా నిలుస్తామని చెబుతున్నారు.

అయితే.. ఈ తరహా ఆఫర్లు ఎక్కువగా అధికార పార్టీ నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో ఉన్నా గుర్తింపునకు నోచుకోని పలువురు ద్వితీయశ్రేణి నేతలు.. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నట్లుగా సమాచారం.

అధికార పార్టీతో చేసుకునే రహస్య ఒప్పందానికి పలువురు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు మరే ఎన్నికల్లోనూ ఈ తరహా వ్యూహాలుతెర మీదకు రాలేదని.. రానున్న రోజుల్లో ఈ తరహా కోవర్టు ఒప్పందాలు తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేయటంతో పాటు.. పార్టీలకు కొత్త అస్త్రాల్ని అందించినట్లు అవుతుందని చెప్పక తప్పదు.