Begin typing your search above and press return to search.

బంగ్లా కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వ‌డంపై ఫార్మా కంపెనీల గ‌గ్గోలు: మ‌హారాష్ట్ర‌పై ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:30 PM GMT
బంగ్లా కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వ‌డంపై ఫార్మా కంపెనీల గ‌గ్గోలు: మ‌హారాష్ట్ర‌పై ఆగ్ర‌హం
X
మ‌హ‌మ్మారి వైరస్ చికిత్సకు ఉపయోగించే మందు ఇంకా ఆవిష్క‌రించ‌లేదు. కానీ ఈ మందుల త‌యారీకి సంబంధించిన విష‌యాలు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. అస‌లుకే మందు రాలేదు. కానీ మందు రాక‌మునుపే వాటిని చేజిక్కించుకోవాల‌ని, వ్యాపారం చేసుకోవాల‌ని ప‌లు సంస్థ‌లు, దేశాలు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లుచోట్ల వివాదాలు, తీవ్ర చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త‌దేశంలో కూడా ఇలాంటి ప‌రిణామం చోటుచేసుకుంది. వైర‌స్ నివార‌ణ‌కు ఉప‌యోగించే ఒక కీలక ఔషధాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ నుంచి కొనుగోలు చేయడం తీవ్ర వివాదాస్పదమ‌వుతోంది. ప్రపంచ దేశాల‌కే ఔషధాలను సరఫరా చేసే భారత ఫార్మా కంపెనీలను కాదని ఒక అనామక కంపెనీకి ఈ కాంట్రాక్టు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. త‌మ‌ను కాద‌ని ఆ సంస్థ‌కు కాంట్రాక్ట్ ఇవ్వ‌డం విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది.

వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ఉపయోగిస్తున్న ఔష‌ధం రెమ్డేసివీర్ కొనుగోలుపై ప్రస్తుతం వివాదం ఏర్ప‌డింది. వైరస్‌కు ముంబై నగరం, మహారాష్ట్ర క‌కావిక‌ల‌మైంది. ఆ రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరికి చికిత్స అందించేందుకు హైడ్రోక్సీక్లోక్సిన్ తో పాటు రెమ్ డెసివీర్ ఔషధాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఔషధానికి భార‌త్‌లో అనుమతి లేకపోవడంతో బంగ్లాదేశ్ ఫార్మా కంపెనీ నుంచి కొనుగోలు చేయనున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులతో కొనుగోలు చేస్తామని చెప్పడంతో దుమారం చెలరేగింది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎస్కాఎఫ్ ఫార్మా కంపెనీ నుంచి రెమ్డెసివీర్ ఔషధాన్ని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర నిర్ణయించింది. ఒక్కోటి రూ 12,000 చొప్పున మొత్తం 10,000 వయల్స్ ఔషధాన్ని కొనుగోలు చేస్తారు. అయితే ఎస్కాఎఫ్ ఫార్మా కంపెనీ తమ సొంత దేశంలో విక్రయిస్తున్న ధరలతో పోల్చితే ఇది రెట్టింపు కావటం వివాదానికి మరో కారణంగా మారింది. ఆ కంపెనీకి భార‌త్‌కు ఔషధాలను దిగుమతి చేసే లైసెన్స్ కూడా లేదు. ఒకటేమో అసలు ఔషధానికే అనుమతి లేదు. రెండోది కంపెనీకి దిగుమతి లైసెన్స్ లేదు. మూడోది ధర రెట్టింపు ఉండటం. ఇన్నేసి నెగ‌టివ్ ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వ‌డం తీవ్ర దుమారం రేపుతోంది.

దేశంలో దిగ్గ‌జ ఫార్మా కంపెనీలు ఎన్నో ఉన్నా‌యి. అన్ని ర‌కాల అనుమ‌తులు భార‌త కంపెనీల సొంతం. మ‌రి అలాంటిది ఈ కంపెనీల‌ను వ‌దిలేసి ఆ దేశానికి చెందిన కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై రెమ్డెసివీర్ ఔషధ హక్కులు కలిగిన గిలియడ్ సైన్సెస్ అనే కంపెనీ స్పందించింది. తాము ఎస్కాఎఫ్ ఫార్మస్యూటికల్స్ సహా బంగ్లాదేశ్‌లోని ఏ ఇతర సంస్థ కు కూడా రెమ్డెసివీర్ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతించలేదు అని స్ప‌ష్టం చేసింది. దీంతో వివాదం మరింత ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇది కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన విషయం కాదని, దేశానికి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమ‌ని ఇండియన్ ఫార్మా కంపెనీలు నిలదీస్తున్నాయి.

ఎలాంటి అనుమతులు లేని విదేశీ సంస్థ నుంచి హడావిడిగా, అధిక ధరలకు డ్రగ్ కొనుగోలు చేయాల్సిన అవసరమేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. భార‌త్‌లో లియడ్ సైన్సెస్‌కు చెందిన రెమ్డెసివీర్ ఔషధాన్ని భారత్‌లో అధికారికంగా ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఔషధం అందుబాటులో ఉంది. దీనికి మన సంస్థలు చెబుతున్న ధర రూ. 7 వేలు మాత్రమే. ఈ ఔషధం మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే భారత ఫార్మా రంగానికి బంగ్లాదేశ్ ఫార్మా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. ఎగుమతి మార్కెట్లలో అది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్రపంచంలో మూడో వంతు ఔషధాలను తయారు చేయటంతో పాటు ఎగుమతి చేసే ఇండియన్ ఫార్మా కంపెనీలకు వీటితో కొత్త తలనొప్పి వచ్చేలా ఉంది. నేరుగా ఆ కంపెనీలకు భార‌త్‌లోకి అనుమతులిస్తే మన దేశీయ కంపెనీలకు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని విశ్లేష‌కులు, ఫార్మా నిపుణులు చెబుతున్నారు.