Begin typing your search above and press return to search.

మంత్రి గారు కనిపిస్తే అదే అడుగుతున్నారుట... ?

By:  Tupaki Desk   |   12 Jan 2022 10:30 AM GMT
మంత్రి గారు కనిపిస్తే అదే అడుగుతున్నారుట... ?
X
సినిమా అన్నది శక్తివంతమైన మాద్యమం. దానికి మించిన రంగాలు, వేల కోట్లతో నడిచే పరిశ్రమలు చాలా ఉండవచ్చు కాక. కానీ సినిమా రంగం విశిష్టతే వేరు. అక్కడ చీమ చిటుక్కుమన్నా భూన భోనంతరాల్లో దద్దరిల్లుతుంది. అలాంటి సినిమాతో వైసీపీ సర్కార్ పెట్టుకుంది. ఇపుడు ఆ సమస్య అటూ ఇటూ తేలక బాగా చుట్టుకుంది. దాంతో సినిమాటోగ్రఫీ శాఖను చూస్తున్న మంత్రి పేర్ని నానిలో అయితే కోపం అసహనం కలగలపి వచ్చేస్తున్నాయిలా ఉంది. అందుకే ఆయన మీడియా మీదనే దాన్ని ప్రదర్శిస్తున్నారు అంటున్నారు.

క్రిష్ణా జిల్లా గుడివాడలో ఎడ్ల పందేం పోటీలను ప్రారంభించిన మంత్రిని మీడియా పలకరించింది. అదేంటో పేర్ని నానిని చూడగానే ఈ మధ్య అందరికీ ఒకే ఒక ప్రశ్న గుర్తుకువస్తోంది. మరి దేశంలో వేరే సమస్యలు లేవా అంటే అలాగని కాదు, ఇదే అతి పెద్ద సమస్య అని చేసి ఫోకస్ పెంచిందే ప్రభుత్వ పెద్దలు. అంతటితో ఊరుకుంటున్నారా ఆ మంత్రీ, ఈ మంత్రీ దాని మీదనే తెల్లారిలేస్తే తెగ మాట్లాడుతున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే సౌండ్ చేస్తున్నారు.

మరి దాని కంటే వేరే సమస్యలు లేవా అని ఎవరైనా అడగొచ్చు. కానీ ఇపుడు అది హాట్ టాపిక్ అయిపోయింది. దాని వల్ల పేదలకు మేలు చేశామని చెప్పుకుందామనుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఇపుడు అదే చిక్కులు తెచ్చిపెడుతోంది. సినిమా రంగం నుంచి రోజుకో ప్రముఖుడు ట్వీటుతున్నారు. దానికీ మంత్రి ఆన్సర్ చేస్తున్నారు. ఆర్జీవీ లాంటి వారితో వరస‌ భేటీలు వేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల మీద, థియేటర్ల వర్గీకరణ మీద 13 మందితో వేసిన కమిటీ ఇప్పటికి రెండు సార్లు సమావేశమైనా ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోయింది.

ఇలా సినిమా టికెట్ల వ్యవహారం కాస్తా టీవీ సీరియల్ మాదిరిగా జీడిపాకంగా సాగిపోతూనే ఉంది. దాంతో పేర్ని నాని ఎక్కడ కనిపించినా మీడియాకు అదే ప్రశ్న అడగాలనిపిస్తుంది. గుడివాడలో కూడా అదే జరిగింది. అయితే ప్రతీ సారీ దీని మీద సుదీర్ఘమైన వివరణ ఇస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకునే మంత్రి గారు ఇపుడు మాత్రం కాస్తా చిర్రుబుర్రులులాడారు. మీకు మరే ఇతర సమస్యలు లేవా. ఎపుడూ ఇదే అడుగుతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి అడగవచ్చు కదా అంటూ కస్సుబుస్సులాడారు. అయితే మంత్రి ఆవేదనలో తప్పు లేదు కానీ దాన్ని చిరిగి చేట చేసింది ఎవరు. నిన్నటి దాకా ఎవరు దాని మీద పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు. పేదలకు వినోదం నింగి నుంచి నేలకు దించామని ఎవరు చెప్పుకోవాలనుకున్నారు. ఇపుడు అది కాస్తా బూమరాంగ్ అయింది. దాంతో ఆ ఇష్యూ మీదనే మాట్లాడేందుకు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా ఉంది.

అయినా సమస్య ఉంటేనే కదా దాన్ని లాగుతారు, పీకుతారు. ఈ రోజుకైనా అటో ఇటో దాన్ని తేల్చేయచ్చు కదా. ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది సొల్యూషన్. అలా చేయకుండా సాగదీస్తూ సర్కార్ వారు పోతున్నంతసేపూ పేర్ని నాని కనిపిస్తే మీడియా సంధించే మొదటి ప్రశ్న సినిమా టికెట్ల మీదనే ఉంటుంది. వద్దన్నా కూడా వారు అడగకుండా మానరు. సో ఈ బరువు దింపుకోవాల్సింది ప్రభుత్వ పెద్దలే సుమా.