Begin typing your search above and press return to search.

రాజధాని ప్రాంతంలో 'ఊరు ఎక్కడి వరకు!?'

By:  Tupaki Desk   |   10 July 2015 5:30 PM GMT
రాజధాని ప్రాంతంలో ఊరు ఎక్కడి వరకు!?
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో గ్రామాలను యథాతథంగానే ఉంచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాలను మినహాయించి మిగిలిన భూములనే తాము సమీకరణ కింద తీసుకుంటామని స్పష్టం చేసింది. గ్రామ కంఠాల జోలికి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. అయితే, గ్రామ కంఠం ఎక్కడి వరకూ!? అనే అంశం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. గ్రామాల్లో కొత్త చిచ్చుకు కారణమవుతోంది.

ఇప్పటి వరకు మనకు గ్రామ కంఠాలు అంటే బ్రిటిష్‌ పాలనలో రూపుదిద్దుకున్నవే. వాటికి, ఇప్పటి గ్రామాలకూ ఏమాత్రం పొంతన లేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు గ్రామాలు భారీగా విస్తరించాయి. ఇక నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా తుళ్లూరు ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత గ్రామాలు మరింత విస్తరించాయి. కొంతమంది గ్రామాల శివార్లలోకి వెళ్లి మరీ నిర్మాణాలు చేపట్టారు. మరికొంతమంది అక్కడ ప్లాట్లను కొనుక్కుని ఇళ్ల నిర్మాణాలకు సిద్ధపడ్డారు. దాంతో వాటిని కూడా కలిపి గ్రామ కంఠంగా నిర్ణయించాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే, భూ సమీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని తీయించిందని, అందులో గ్రామ కంఠాలు సుస్పష్టంగా ఉన్నాయని, దాని ప్రకారమే గ్రామ కంఠాలను నిర్మిస్తామని, ఆ తర్వాత చేసిన నిర్మాణాలను పట్టించుకోబోమని అధికారులు తేల్చి చెబుతున్నారు. వాటిని కూల్చి పొలాలుగానే పరిగణిస్తామని చెబుతున్నారు. అయితే, దీనిని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాజధానిలో ఊరు ఎక్కడి వరకూ అనే కొత్త వివాదం మొదలైంది.