Begin typing your search above and press return to search.

జ‌న‌సేన శ్రీకారం చుట్టిన మ‌రో కొత్త కార్య‌క్ర‌మం ఇదే!

By:  Tupaki Desk   |   12 July 2022 10:30 AM GMT
జ‌న‌సేన శ్రీకారం చుట్టిన మ‌రో కొత్త కార్య‌క్ర‌మం ఇదే!
X
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ రెండు ప‌డ‌వ‌ల మీద విజ‌య‌వంతంగా స్వారీ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే సినిమాల కంటే రాజ‌కీయాల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఓవైపు జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న ప‌వ‌న్.. మ‌రోవైపు జ‌న‌వాణి కార్య‌క్ర‌మం పేరుతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తి ఆదివారం అర్జీలు స్వీక‌రించే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని నామ‌క‌ర‌ణం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్లు దారుణ స్థితిలో ఉన్నాయ‌ని.. ఆయ‌న‌ను నిద్ర లేపేందుకే ఈ గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశామ‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయ‌ని.. క‌నీస మ‌రమ్మ‌తులు కూడా చేయ‌డం లేద‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టనున్నామ‌ని తెలిపారు.

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో స్వ‌యంగా పాల్గొంటార‌ని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో బాగా పాడైన‌ రోడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామ‌ని చెప్పారు.

గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్య‌క్ర‌మంలో జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొంటారు. గ్రామాలు, మండలాల రోడ్ల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. రోడ్ల మరమ్మతుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు వేరే ప‌థ‌కాల‌కు దారి మ‌ళ్లిస్తున్నార‌ని మ‌నోహ‌ర్ ఆరోపిస్తున్నారు.

సామాన్యుడి మీద భారం వేసి, పెట్రోల్ మీద ఏటా రూ.750 కోట్ల రోడ్ సెస్ వసూలు చేస్తున్నార‌ని.. ఆ సెస్ చూపి ప్ర‌భుత్వం రూ.6 వేల కోట్ల అప్పు తెచ్చింద‌ని నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే, ఆ నిధులు దేనికోసం ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాల‌ని నాదెండ్ల డిమాండ్ చేస్తున్నారు.