Begin typing your search above and press return to search.

17 ఏళ్లకు పర్యటన.. 13 మందికి వైరస్.. ఒక్క రోజులో 500 పరుగులు

By:  Tupaki Desk   |   2 Dec 2022 6:54 AM GMT
17 ఏళ్లకు పర్యటన.. 13 మందికి వైరస్.. ఒక్క రోజులో 500 పరుగులు
X
దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు ఆడుతోంది.. అంతా బాగానే ఉంది.. మరొక్క రోజులో మ్యాచ్ అనగా పిడుగులాంటి వార్త. జట్టు మొత్తం 17 మంది సభ్యుల్లో 17 మందికి వైరస్. ఆ వైరస్ ఏమిటో తెలియదు. కానీ.. ప్రధాన ఆటగాళ్లంతా దాని బారినపడ్డారు. దీంతో అందుబాటులో ఎవరుంటే వారితోనే ఆడాల్సిన పరిస్థితి. టి20 స్పెషలిస్టు లియాన్ లివింగ్ స్టన్ నూ తుదిజట్టులోకి తీసుకుని బరిలో దిగారు. ఇదీ ఇంగ్లండ్ పరిస్థితి. కానీ, అలాంటి జట్టే ఒక్క రోజులో 500 పైగా పరుగులు సాధించి ప్రపంచ రికార్డును తిరగరాసింది.

112 ఏళ్ల రికార్డు బద్దలు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ ఒక్క రోజులో (తొలి రోజు) అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆ రికార్డు ఆస్ట్రేలియా (494/6, 1910లో దక్షిణాఫ్రికా) పేరిట ఉంది. అంటే 112 ఏళ్ల రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది.

మరో విశేషమేమంటే టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ . క్రాలీ (122; 111 బంతుల్లో 21×4), పోప్‌ (108; 104 బంతుల్లో 14×4), డకెట్‌ (107; 110 బంతుల్లో 15×4), బ్రూక్‌ (101 బ్యాటింగ్‌; 81 బంతుల్లో 14×4, 2×6) పరుగుల వరద పారించారు. అంతేగాక టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టిన అయిదో బ్యాట్స్‌మన్‌ బ్రూక్‌ నిలిచాడు. గతంలో సందీప్‌ పాటిల్‌, గేల్‌, శర్వాణ్‌, జయసూర్య ఈ ఘనత సాధించారు.

మామూలు ఆట కాదు అది "బజ్ బాల్" టెస్టు క్రికెట్ లో కొంతకాలంగా ఇంగ్లండ్ పాటిస్తున్న పద్ధతి ఇది. అంటే.. బంతిని బాదడమే లక్ష్యం. న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ కోచ్ గా వచ్చాక ఇంగ్లండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇటీవల భారత్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆడిన తీరును చూసినవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది.

కాగా, గురువారం పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ 6.74 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. 75 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 6.74 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. వెలుతురు లేమి కారణంగా ఆట త్వరగా ముగియకుంటే సులువుగా 600 పైగా పరుగులు చేసేది.

ఆట మొదలవుతుందా అనుకుంటే.. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 17 మంది ఇంగ్లండ్ సభ్యుల్లో 13 మందికి వైరస్ సోకడంతో ఈ టెస్టు మ్యాచ్ మొదలవుతుందా? అనే అనుమానం కలిగింది. గురువారం నుంచి కాక శుక్రవారం నుంచి మ్యాచ్ ను నిర్వహించాలని భావించారు. అయితే, చివరకు సరిగ్గా 2 గంటల ముందు గురువారం ఉదయం 7.30 సమయంలో తమకు మైదానంలోకి దిగేందుకు సరిపడా సభ్యులు ఉన్నారని ఇంగ్లండ్ చెప్పడంతో మ్యాచ్ మొదలైంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఆ ప్రభావమేమీ లేకుండా ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ దుమ్మురేపారు.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగడమే ఆలస్యం..పరుగుల వరద పారించారు.

గాయంతో పాక్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రిది ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. ఫాస్ట్‌బౌలర్లు రవూఫ్‌, మహ్మద్‌ అలీ,లెగ్‌స్పిన్నర్‌ జాహిద్‌ టెస్టు అరంగేట్రం చేశారు. వారి అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ జోరుతో లంచ్‌ సమయానికే ఇంగ్లాండ్‌ 174 పరుగులు చేసింది. క్రాలీ 86 బంతుల్లో, డకెట్‌ 105 బంతుల్లో, పోప్‌ 90 బంతుల్లో, బ్రూక్‌ 80 బంతుల్లో సెంచరీలు సాధించారు. దీంతో తొలి టెస్టు తొలి రోజు,గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు సాధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.