Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం ఆవిష్కారం

By:  Tupaki Desk   |   31 July 2019 4:45 AM GMT
ఏపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం ఆవిష్కారం
X
అసెంబ్లీ సమావేశాలు అన్నంతనే అధికార.. విపక్షాల మధ్య వాదనలు తప్పించి.. ప్రజలకు ఉపయోగపడే చట్టాల రూపకల్పన విషయంలో పెద్దగా ఆసక్తిని ప్రదర్శించరు. తమ అధికారాన్ని చూపించటమే తప్పించి.. చట్టాల తయారీకి అవసరమైన అంశాల మీద లోతుగా చర్చలు జరపటం కనిపించదు. అందుకు భిన్నంగా వ్యవహరించింది ఏపీలోని అధికారపక్షం.

తాజాగా ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని పరిశీలిస్తే.. సభలో ఏదోలా రచ్చ చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నించినా.. సభను సమర్థంగా నడపటమే కాదు.. పెద్ద ఎత్తున బిల్లులు పెట్టి.. వాటిపై చర్చ జరిపి.. ఆమోదించిన వైనం కనిపిస్తుంది. తాజాగా ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తే.. 14 రోజుల పాటు సాగిన సమావేశాల్లో 20 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించటం ఒక విశేషమైతే.. వీటిల్లో ఒక్క దానిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మిగిలిన 19 బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేయటం గమనార్హం.

గత ప్రభుత్వాలన్ని అసెంబ్లీలో బిల్లులపై చర్చ కంటే కూడా.. ఏక వాక్యంతో గిలెటిన్ చేయటమే కనిపించేది. పద్దులపై చర్చ జరగటం చాలా తక్కువ సందర్భాల్లోనే ఉండేది. అందుకు భిన్నంగా జగన్ సర్కారు మాత్రం పలు అంశాలపై చర్చలు జరిపి మరీ బిల్లులకు ఆమోదముద్ర వేశారు. తాజాగా సభ ఆమోదం పొందిన బిల్లులలో వెనుక బడిన వర్గాలతో పాటు ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీ.. మహిళలకు మేలు కలిగించే చట్టాలతో పాటు.. ప్రజలందరికి ఉపయోగపడేలా ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్డూ అదుపు లేకుండా వసూలు చేస్తున్న ఫీజులకు చెక్ చెప్పేలా బిల్లుకు ఆమోదముద్ర వేయటం గమనార్హం.

గత ప్రభుత్వాలలో సభకు వచ్చిన కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశాలు తక్కువగా ఉండేవి. రికార్డుల్లో ఎక్కటానికి వీలుగా వారి పదవీ కాలమైన ఐదేళ్లలో ఏదో ఒక సందర్భంలో తూతూ మంత్రంగా మాట్లాడించేవారు. అందుకు భిన్నంగా కొత్త సభ్యుల్ని చర్చలు భాగస్వామ్యం చేయటంతో పాటు.. వివిధ సందర్భాల్లో ఏదో రూపంలో వారికి మాట్లాడే అవకాశం కల్పించటం ఒక కొత్త సంప్రదాయంగా మార్చారు.

సభలో ప్రతి పద్దు మీదా సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించటంతో పాటు.. ప్రతి పద్దు మీదా ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులు మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం తన సీట్లో ఉంటూ ాయాన సభ్యులకు మంత్రులతో పాటు.. తాను సైతం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సభలో లొల్లి జరిగేందుకు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించిన విపక్షం.. సభలో చర్చ విషయంలో మాత్రం వెనకడుగు వేసిన వైనం కనిపించింది. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీని నిరోధించే బిల్లుపై చర్చ విషయంలో.. చర్చ జరిగే దాని కంటే కూడా సభలో ఏదో వంకన గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం కనిపించింది. అలాంటి వాటికి చెక్ చెప్పేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించి సక్సెస్ అయ్యింది.