Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. పెళ్లి రద్దు చేసుకున్న ప్రధాని..!

By:  Tupaki Desk   |   23 Jan 2022 4:06 AM GMT
కరోనా ఎఫెక్ట్.. పెళ్లి రద్దు చేసుకున్న ప్రధాని..!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. న్యూజిలాండ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గతకొద్ది రోజులగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఆ దేశం చర్యలు చేపట్టింది. కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.

ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ ప్రెస్ మీట్ ఏర్పటు చేశారు. వివిధ కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. పెళ్లి వంటి శుభాకార్యాలకు పరిమిత సంఖ్యలో జనం హాజరుకావాలని ఆదేశించారు. రెండు డోసుల టీకా తీసుకున్న వంద మందిని మాత్రమే వివాహ వేడుకకు అనుమతించాలని ప్రకటించారు. కాగా ఆమె పెళ్లి గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనిపై జసిండా తనదైన రీతిలో స్పందించారు.

న్యూజిలాండ్ లో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని ఆమె చెప్పారు. పెళ్లికి వంద మందికి మించి హాజరుకాకూడదని స్పష్టం చేశారు. ఆంక్షల నడుమ పెళ్లి ఇష్టం లేని వాళ్లు... తమ వివాహాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో జసిండా పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే తాను కూడా ఆ దేశంలో సామాన్యపౌరురాలిని అన్నారు. వారికంటే తానేమి భిన్నం కాదని పేర్కొన్నారు.

అందుకే ఆంక్షలకు లోబడి ఉంటానని వ్యాఖ్యానించారు. కరోనా నిబంధనల నడుమ తాను పెళ్లిచేసుకోవడం లేదని తెలిపారు. తన వివాహాన్ని కొంతకాలం పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

న్యూజిలాండ్ ప్రధాని జసిండా, క్లార్గ్ గేఫోర్డ్ చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి పెళ్లి గురించి ఇప్పటికే అనేక ప్రకటనలు వచ్చాయి. కాగా వివాహం చేసుకోవాడానికి తమకు సమయం లేదంటూ ఆమె ఓ సారి చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఈ వేసవిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అందుకు సంబంధించిన ఓ ప్రకటన ఇటీవలె విడుదల చేశారు.

అయితే పెళ్లి సమయం, తేదీ వంటివాటిని మాత్రం వెల్లడించలేదు. కాగా ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా వివాహాన్ని మరికొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు జసిండా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

కరోనా మహమ్మారి దశల వారీగా పంజా విసురుతోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. గతేడాది మార్చిలో రెండో దశ రూపంలో ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చింది.

2021, డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. దీని ప్రభావం తక్కువే ఉన్నా కూడా వ్యాప్తిచెందే గుణం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లాయి. వివిధ దేశాల్లో కఠిన నిబంధనలు విధిస్తున్నారు.