Begin typing your search above and press return to search.

ఇక గీత దాటితే వేటే.. ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్

By:  Tupaki Desk   |   15 March 2022 8:55 AM GMT
ఇక గీత దాటితే వేటే.. ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్
X
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూలింగ్ ప్రకారం.. సభలో ఎవరైనా సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుపడితే వారు సస్పెండ్ అవుతారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సభను హుందా నడిపేందుకు కొత్త రూల్ తీసుకొచ్చినట్టు గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యే రూలింగ్ ను తీసుకువస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్ ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్ ను దాటితే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతేకాదు.. సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్ కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. జంగారెడ్డి గూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలకు అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు పదే పదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక ఐదుగురు ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండి తమ నిరసనను కొనసాగించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. మార్షల్స్ తో సభ నుంచి వారిని బయటకు పంపించారు. అనంతరం మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు.

మార్చి 14న సోమవారం ఏపీ అసెంబ్లీలో ఐదుగురు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వీరిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల్లో నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, గొట్టిపాటి రవికుమార్, ఆదిరెడ్డి భవానీ, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎం రామరాజు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లు ఉన్నారు.