Begin typing your search above and press return to search.

కొత్త రూల్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీనా.. వేలిముద్ర ఇచ్చాకే ఎంట్రీనట!

By:  Tupaki Desk   |   15 Sep 2021 3:53 AM GMT
కొత్త రూల్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీనా.. వేలిముద్ర ఇచ్చాకే ఎంట్రీనట!
X
ఇప్పటివరకు అమలైన విధానానికి భిన్నంగా కొత్త నిబంధనను తెర మీదకు తీసుకొచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనరల్ బోగీలో జర్నీ అంటే.. ఇప్పటివరకు సాగిన విధానానికి బ్రేకులు వేశారు. ఇకపై.. సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ట్రైన్ వేళకు పావు గంట ముందే రావాలి. టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అనంతరం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఏంటి? టోకెన్ ఏంటి? అన్న డౌట్ వచ్చిందా? సరికొత్త విధానంలో ఇలానే చేయాల్సి ఉంటుంది. అర్థం కావట్లేదా? వివరంగా చెప్పాల్సి వస్తే..

ఇప్పటివరకు అమలైన విధానానికి భిన్నంగా కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో బయోమెట్రిక్ టోకెన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈసరికొత్త సేవల్ని తాజాగా షురూ చేశారు. ట్రైన్ ఏదైనా కానీ.. జనరల్ కోచ్ లో జర్నీ చేయాలనుకున్న వారు టికెట్ తీసుకోవటం వరకు పాత పద్దతే. అక్కడి నుంచే కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

టికెట్ తీసుకున్న తర్వాత బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికుడి పేరు.. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రయాణిస్తున్నారనే వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుంటారు. అనంతరం ఒక టోకెన్ ఇస్తారు. ఇందులో వారు ప్రయాణించాల్సిన ట్రైన్ వివరాలతో పాటు.. వారు ఎక్కాల్సిన కోచ్ వివరాలు ఉంటాయి. అంటే.. అన్ రిజర్వ్ అయినప్పటికీ.. కొంతమంది ప్రయాణికులకు ఒక కోచ్ చొప్పున కేటాయిస్తారు. దానికి తగ్గట్లు.. సదరు కోచ్ లోనే ప్రయాణికులు ఎక్కాల్సి ఉంటుంది.

రైలు ఎక్కటానికి పావు గంట ముందు వచ్చి.. సిబ్బందికి టోకెన్ చూపించి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొత్త విధానంలో ట్రైన్ సమయానికి కనీసం అరగంట.. ముప్పావు గంట ముందు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. తాజాగా తీసుకొచ్చిన విధానంలో తొక్కిసలాట లేకుండా.. సులువుగా రైలు ఎక్కటానికి సాయం చేస్తుందని చెబుతున్నారు. మాటల్లో వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా ఇదంతా వర్కువుట్ అవుతుందా? అన్నదే అసలు ప్రశ్న.