Begin typing your search above and press return to search.

ఏటీఎం కొత్త రూల్స్ లాభమా? నష్టమా?

By:  Tupaki Desk   |   29 Sep 2019 5:18 AM GMT
ఏటీఎం కొత్త రూల్స్ లాభమా? నష్టమా?
X
ఒకప్పుడు చేతిలోనే డబ్బులు ఉండేవి. అవసరం ఉండదనుకున్న మొత్తాన్నే బ్యాంకులో దాచేటోళ్లు. బ్యాంకులో డబ్బులు దాచుకోవటం.. వాటిని తిరిగి తీసుకోవటం ఒక పెద్ద తలనొప్పిగా మారే రోజుల నుంచి మొత్తం డబ్బుల్ని బ్యాంకుల్లో ఉంచేసేలా చేసింది ఏటీఎం. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బుల్ని తీసుకునేందుకు వీలుగా వచ్చిన డెబిట్ కార్డు.. ఏటీఎం పుణ్యమా అని బ్యాంకింగ్ రూపురేఖలు మారిపోయిన పరిస్థితి.

దేశంలో అలా మొదలైన ఏటీఎంలు.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 2.2 లక్షల వరకూ ఉన్నట్లు ఒక అంచనా. చేతిలో ఉండాల్సిన డబ్బులు బ్యాంకుల్లో.. పర్సులో ఉండాల్సిన నోట్ల స్థానే డెబిట్ కార్డులు వచ్చేశాయి. మొదట్లో ఇదంతా బాగానే ఉన్నా.. ఏటీఎంతో వచ్చే సాంకేతిక సమస్యలు.. నెలలో ఏటీఎంను ఎన్నిసార్లు వాడాలంటూ పరిమితులు విధించటం.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కట్ అయిపోయినా.. ఏటీఎంలో నుంచి బయటకు రాని క్యాష్ లాంటి ఇష్యూలతో పాటు.. అవసరమైన వేళ వరుస పెట్టి ఏటీఎంలు ఖాళీగా దర్శనమిచ్చే సీన్లు అప్పుడప్పుడు ఎదురవుతున్నాయి.

ఇలాంటి వాటిని సరి చేస్తూ.. వినియోగదారులకు మేలు కలిగేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల వినియోగానికి సంబంధించి కొత్త నిబందనల్ని తీసుకొచ్చింది. ఇందులో పలు అంశాలు ఖాతాదారులకు లాభం చేకూర్చేవిగా చెప్పాలి. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం..

ఏటీఎంలలో నగదు లేని కారణంగా లావాదేవీ ఫెయిల్ అయితే దానిని లెక్కలోకి తీసుకోకూడదు.. అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదన్నది ఒకటి. అదొక్కటే కాదు.. తప్పుడు పిన్ నంబర్ల కారణంగా లావాదేవీ ఫెయిల్ అయితే వాటిని సర్వర్లు లెక్కలోకి తీసుకోకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఏటీఎంలో హార్డ్ వేర్.. సాఫ్ట్ వేర్.. కమ్యూనికేషన్ కారణాలతో లావాదేవీలు ఫెయిల్ అయితే.. వాటిని కూడా లావాదేవీల లెక్కలోకి తీసుకోకూడదని నిర్ణయించారు. చాలా బ్యాంకులు పరిమిత సంఖ్యలోనే ఏటీఎం లావాదేవీల్ని ఉచితంగా ఇస్తున్నాయి. వారు నిర్ణయించిన పరిమితిని దాటినంతనే.. ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఉన్న రూల్స్ ప్రకారం ఫెయిల్ అయిన లావాదేవీలకు సైతం లెక్కలోకి తీసుకునే వారు. కానీ.. కొత్త నిబంధన ప్రకారం విఫలమైన లావాదేవీల్ని లెక్కలోకి తీసుకొని చార్జీలను వసూలు చేయకూడదని నిర్ణయించారు.

అన్నింటికంటే ముఖ్యమైనది.. ఏటీఎంలో క్యాష్ కోసం వెళితే.. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు డబ్బులు చేతికి రావు కానీ.. ఖాతాలో కట్ అయిపోయినట్లుగా మెసేజ్ వచ్చి.. గుండె జారేలా చేస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రయత్నాల తర్వాత.. ఫిర్యాదులు చేసిన తర్వాత డబ్బులు ఖాతాలో పడతాయి.

అయితే.. ఇలా జరిగినప్పుడు లావాదేవీ జరిగి..చేతికి డబ్బులు రాకుండా ఖాతాలో సొమ్ము కట్ అయిన వేళలో.. లావాదేవీ జరిగిన రోజుతో పాటు.. మరో ఐదు రోజుల గడువులో బ్యాంకులు ఆ డబ్బును ఖాతాలో జమ చేయాలి. ఒకవేళ అలా కాకుండా.. పరిమితికి మించిన ఆలస్యమయ్యే ప్రతి అదనపు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. మొత్తంగా చూస్తే.. వినియోగదారుడి యాంగిల్ లో చూసి ఆర్ బీఐ కొత్త నిబంధనల్ని తెర మీదకు తెచ్చినట్లుగా కనిపించిక మానదు.