Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలకు గట్టి రూల్స్ పెట్టేశారే !

By:  Tupaki Desk   |   29 July 2022 11:30 AM GMT
ఎమ్మెల్యేలకు గట్టి రూల్స్ పెట్టేశారే !
X
తెలంగాణలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల పేరిట జారీ చేస్తున్న వాహనాల స్టిక్కర్ల దుర్వినియో గంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏటా ఏప్రిల్‌ మొదటి తేదీన.. ఏడాది కాలపరిమితితో శాసనసభ, మండలి సభ్యులకు ప్రభుత్వం ఈ స్టిక్కర్లను పంపిణీ చేస్తోంది. ప్రతి సభ్యుడికి మూడేసి స్టిక్కర్లు ఇస్తారు. వివిధ కారణాల వల్ల అవి పనికిరాకుండా పోతే మరో రెండు స్టిక్కర్లు ఇస్తారు.

ఇవి దుర్వినియోగమవుతున్నాయని గతంలోనే పలు ఉదంతాల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తాజాగా క్యాసినో వ్యవహారంలో నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లోని కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్‌ ఉన్నట్లు గుర్తించారు. గత మార్చి నెలాఖరు వరకు వినియోగించేలా దాన్ని జారీ చేయగా... అది ఇప్పటికీ కారుపై ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అయిదు వేలకు పైగా స్టిక్కర్లు వినియోగంలో ఉన్నాయి. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్టిక్కర్లపై వారి పేరుతో పాటు వాహనం నంబరు కూడా నమోదు చేయనున్నారు.

స్టిక్కర్‌ వినియోగానికి గడువు తేదీని పేర్కొంటారు. ఆ తేదీ ముగిసిన వెంటనే దాన్ని తొలగించి, విధిగా కొత్తవి వాడాలని సూచిస్తారు. ఒక‌వేళ అప్ప‌టికీ స్టిక్క‌ర్లు మార్చుకోక‌పోతే.. స‌ద‌రు వాహ‌నాల‌పై కేసులు న‌మోదు చేసే అధికారాన్ని ఏసీపీ స్థాయి అధికారికి క‌ట్ట‌బెడుతూ.. తాజాగా సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. కేసుల న‌మోదు విష‌యాన్ని ఒక‌సారి స‌భ‌లో అంద‌రిస‌భ్యుల‌తోనూ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

ఇక‌, ఈ తాజా నిర్ణ‌యంతో ఇక‌పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్క‌ర్ల‌ను ఎవ‌రు బ‌డితే వారు వినియోగించే అవ‌కాశం లేద‌ని.. అలా వినియోగించ‌డం కూడా క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగ‌ణించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌రి దీనిపై ఎమ్మెల్యేలు ఏమంటారో చూడాలి. ఇటీవ‌ల హైద‌రాబాద్ గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌లోనూ ఇలానే ఒక కారుపై .. ఎమ్మెల్యే స్టిక్క‌ర్ ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. ఏదేమైనా..తాజా నిర్ణ‌యం ఒకింత ఉప‌శ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.