Begin typing your search above and press return to search.

కొత్త సచివాలయం పూర్తి..: ఎన్నికోట్లు ఖర్చయ్యాయో తెలుసా..?

By:  Tupaki Desk   |   27 July 2022 4:30 PM GMT
కొత్త సచివాలయం పూర్తి..: ఎన్నికోట్లు ఖర్చయ్యాయో తెలుసా..?
X
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం పూర్తి దశలోకి వచ్చింది. ఈనెల 31న సచివాలయ పనులు పూర్తవుతున్నట్లు రోడ్లు భవన శాఖ అధికారులు తెలిపారు. సచివాలయ నిర్మాణ పనులపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ అడిగారు. దీంతో ఆర్ అండ్ బీ విరణ ఇచ్చింది. సచివాలయ నిర్మాణ పనులే కాకుండా ఈ భవనం నిర్మాణానికి ఎంత ఖర్చయింది..? తదితర వివరాలను కూడా అందించారు. ఈ సమాచారం పొందుపరిచిన ఉత్తరం ఈనెల 21వతేదీన కరీమ్ అన్సారీ అనే వ్యక్తి కి అందింది.

కొత్త సచివాలయ నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. పాత సచివాలయాన్ని కూలగొట్టేటప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. అంతా బాగున్నా కూల్చేయడం దేనికని ప్రశ్నించారు. కొందరు కోర్డులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అయితే హైకోర్టు మాత్రం సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. కొత్త సచివాలయాన్ని ఎక్కడ కట్టాలని తీవ్రంగా ఆలోచించారు కేసీఆర్. చివరికి అక్కడే కట్టాలని నిర్ణయించారు. అయితే పాత సచివాలయంలో ఉన్న కొన్ని గుళ్లు, ప్రార్థన మందిరాలను కూడా కూల్చారు.

1978లో బీ,సీ బ్లాక్ లను, 1998లో ఏ బ్లాక్ ను, 2003లో డీ బ్లాక్ ను నిర్మించారు. 2012లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాక్ లను నిర్మించారు. బ్లాకులన్నీ కలిపి సచివాలయం మొత్తం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది.

అయితే ఇప్పుడున్న సచివాలయం పద్దతి లేకుండా ఉందని, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి కట్టడాలు లేవని సీఎం కేసీఆర్ విమర్శించారు. పాత సచివాలయంలో అసలు పార్కింగే లేదని అన్నారు. విదేశాల నుంచి అతిథులు వస్తే అతిథ్యం ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు, ఇతర సందర్శకులు కోసం కెఫెటేరియా ఏమీ లేవని ఆయన పాత సచివాలయం కూల్చివేత సందర్భంగా అన్నారు.

కొత్త సచివాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.617 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కానీ భవన నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.217 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొత్త భవన సముదాయంలో ప్రధాన కార్యాలయంతో పాటు దక్షిణ, పశ్చిమ దిశల్లో అనుబంధ భవనాలను నిర్మించారు.

అలాగే గుడి, మసీదు, చర్చిలను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఇంకా భవన నిర్మాణాలు కొనసాగుతున్నా ఈనెల 31న పూర్తవుతాయని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. అంటే దసరా పర్వదినం సందర్భంగా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి ఆ పండుగ సందర్భంగా కొత్త భనవం ప్రారంభించనున్నారు.