Begin typing your search above and press return to search.

భారత అమ్ముల పొదిలో జల ఖడ్గాలు

By:  Tupaki Desk   |   5 Jun 2021 2:30 AM GMT
భారత అమ్ముల పొదిలో జల ఖడ్గాలు
X
యుద్ధ రంగంలో ముందుగా కత్తి దూయొద్దనేది ధర్మ సూత్రం. కానీ.. ప్రత్యర్థి ఆ సూత్రాన్ని ఎంత వరకు పాటిస్తాడనేది ఎప్ప‌టికీ స‌మాధానం లేని ప్ర‌శ్నే. అందువ‌ల్ల స‌మ‌రానికి ఎల్ల‌వేళ‌లా స‌న్న‌ద్ధంగా ఉండాలి. యుద్ధం అనివార్య‌మైన త‌ర్వాత‌.. ర‌ణ‌క్షేత్రంలోకి దిగిన త‌ర్వాత.. స‌రైన ఆయుధాలు లేక‌పోతే ఓట‌మికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే.. ఆయుధ సంప‌త్తి అనివార్యం. మాన‌వ జాతి చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే.. అడుగ‌డుగునా ఈ విష‌యం క‌నిపిస్తుంది.

ఇప్పుడు స‌రిహ‌ద్దున ఉన్న చైనాతో వైరం కొన‌సాగుతూనే ఉంది. ప‌లు మార్లు ప‌రిస్థితి ఘ‌ర్ష‌ణ స్థాయిని దాటిపోయింది కూడా. అందుకే.. అమ్ముల పొదిని నింపుకునేందుకు కృషి చేస్తోంది భార‌త్‌. యుద్ధం రావాల‌న్న‌ది ఆకాంక్ష కాదు.. కానీ, వ‌స్తే స‌న్న‌ద్ధంగా ఉండాల్సిందే. ఇందులో భాగంగానే వాయు, జ‌ల విభాగాల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆ మ‌ధ్య రాఫెల్ విమానాల‌ను దిగుమ‌తి చేసుకున్న భార‌త్‌.. ఇప్పుడు రూ.50 వేల కోట్ల విలువైన 6 జ‌లాంత‌ర్గాముల నిర్మాణానికి తుది అనుమ‌తి ఇచ్చింది. రెండు భార‌తీయ కంపెనీల‌తోపాటు మ‌రో విదేశీ సంస్థ క‌లిసి వీటిని నిర్మించ‌నున్నాయి. దీనికి అనుమ‌తి ఇస్తూ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫ‌ర్ ప్ర‌పోజ‌ల్ ను జారీచేసింది. ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

మొత్తం 6 జ‌లాంత‌ర్గాముల నిర్మాణం మ‌జ‌గావ్ డాక్ యార్డులో కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ జ‌లాంత‌ర్గాముల క‌న్నా.. ఇవి సుమారు 50 శాతం పెద్ద‌గా ఉండ‌బోతున్నాయి. ఈ జ‌లాంత‌ర్గాముల్లో.. హెవీ డ్యూటీ ఫైర్ ప‌వ‌ర్‌, 12 ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిప‌ణులు, యాంటీ షిప్ క్రూయీజ్ క్షిప‌ణులు ఉంటాయి. అంతేకాదు.. 18 హెవీ వెయిట్ టార్పెడోల‌ను మోసుకెళ్లే సామ‌ర్థ్యం కూడా వీటికి ఉండాల‌ని నేవి సూచించింది. వీటిని మ‌జాగావ్ డాక్స్‌, ఎల్ అండ్ టీ కంపెనీలు నిర్మించ‌నున్నాయి.