Begin typing your search above and press return to search.

చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల పార్కింగ్ కు కొత్త టెక్నాలజీ

By:  Tupaki Desk   |   2 Jun 2023 3:04 PM GMT
చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల పార్కింగ్ కు కొత్త టెక్నాలజీ
X
చెన్నైలోని మీనంబాక్కం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే విమానాలు పార్కింగ్ చేసుకోవటానికి వీలుగా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానానికి బదులుగా ఈ కొత్త విధానాన్ని గురువారం నుంచి అమలు చేస్తున్నారు. రన్ వే మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరికరాల్లోని సిగ్నల్ లైట్ల ద్వారా విమానాలు తాము పార్కింగ్ చేయాల్సిన ప్రాంతాల్ని ఇట్టే గుర్తించేలా ఈ విధానాన్ని సిద్ధం చేశారు.

చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల్ని పార్కింగ్ చేయటానికి వందకు పైగా ప్రాంతాలు ఉంటే.. వీటిల్లో 95 ప్రాంతాల్లో మాత్రమే విమానాల్ని పార్కింగ్ చేసేందుకు అనుమతిస్తారు. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో.. విమానాలు రన్ వే మీద ల్యాండ్ అయ్యాక.. టాక్సీ వే రహదారికి వస్తాయి. ఆ తర్వాత విమానాల్ని పార్కింగ్ ప్రదేశానికి చేరతాయి.

అయితే.. రన్ వే నుంచి విమానాల్ని పార్కింగ్ ప్రాంతాలకు చేర్చేందుకు ఎయిర్ పోర్టు గ్రౌండింగ్ సిబ్బంది సాయపడతారు. సిబ్బంది తమ చేతులతోసిగ్నల్ లైట్లు పట్టుకొని సైగలు చేస్తారు. వారి సాయంతో పార్కింగ్ ప్రదేశానికి చేరతారు.

విడిరోజుల్లో ఇలాంటి పనులు చేయటానికి ఇబ్బంది లేకున్నా.. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు.. తుపానుల సందర్భంగా సిబ్బంది పని చేయటం సాయం కష్టంగా మారుతోంది.

కొత్త విధానంలో విదేశాల్లో అమలు చేస్తున్న అడ్వాన్స్ విజువల్ టేకింగ్ గైడెన్స్ సిస్టమ్ పరికరాలు అమర్చారు. ఇటీవల ఈ తరహా పరికరాలు దాదాపు 50కు పైగా అమర్చారు. మూడు రోజుల క్రితం పరీక్షించి.. అంతా సరిగా ఉందని నిర్ణయించిన తర్వాత గురువారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

రన్ వే నుంచి టాక్సీ వేకు చేరిన తర్వాత పైలెట్లు 60 మీటర్ల దూరంలో కాక్ పిట్ కు సమానమైన ఎత్తులో సిగ్నల్స్ ను ఏర్పాటు చేస్తారు. వీటి ఆధారంగా విమానాల్ని పార్కింగ్ ప్రదేశాలకు సులువుగా చేర్చే వీలుంది. ఒకవేళ.. విమానాలు సిగ్నల్స్ కు భిన్నంగా వెళుతుంటే మాత్రం వెంటనే.. పెద్ద శబ్ధంతో అలెర్టు చేస్తాయి. దీంతో.. పైలెట్లు తప్పు దారిలో వెళ్లకుండా నియంత్రిస్తాయి.