Begin typing your search above and press return to search.

తెలంగాణకు కొత్త టెన్షన్.. ఒకే రోజులో 14 ఒమిక్రాన్ కేసులు

By:  Tupaki Desk   |   23 Dec 2021 4:28 AM GMT
తెలంగాణకు కొత్త టెన్షన్.. ఒకే రోజులో 14 ఒమిక్రాన్ కేసులు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్ లో కాస్త ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చింది. కరోనాలో ప్రమాదకరమైన వేరియంట్ గా పేర్కొనే ఒమిక్రాన్.. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచే వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఒకటి రెండు కేసులు మాత్రమే వెలుగు చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఒకే రోజు లో ఏకంగా 14 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వైనాన్ని గుర్తించారు. ఇంత ఎక్కువ గా కేసులు.. ఒకే రోజు లో నమోదు కావటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

ఈ పద్నాలుగు మందిలో ఒమిక్రాన్ రిస్కు దేశాలుగా గుర్తించిన యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరు.. నాన్ రిస్క్ దేశాలుగా పేర్కొనే కెన్యా.. సోమాలియా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు 12 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా.. 11 మంది పురుషులు ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్ని కలుపుకుంటే.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 38 కేసులకు చేరుకున్నట్లైంది.

షాకింగ్ అంశం ఏమంటే.. ఒమిక్రాన్ కేసులు అత్యధికం నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలోనే రావటం గమనార్హం. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో.. ఒమిక్రాన్ నాన్ రిస్కు దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు ర్యాండమ్ గానే సాగుతున్నాయి. అదే సమయం లో.. రిస్కు దేశాల నుంచి వచ్చే వారిని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

తాజాగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో నాన్ రిస్కు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు జరిపే పరీక్షల విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారిలో కేవలం 2 శాతం మందికే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన వారికి పరీక్షలు చేయటం లేదు.

ఒకవేళ టెస్టులు చేసినా.. వారిని ఫలితం వచ్చే వరకు జాగ్రత్తగా ఉంచకుండా శాంపిల్స్ ను సేకరించి ఇంటికి పంపిస్తున్నారు. అలా బయటకు వస్తున్న వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ సోకుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా నమోదైన 14 కేసుల్లో ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇక.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో నలుగురికి కరోనా పాజిటివ్ కాగా.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా? లేదా? అన్న విషయాన్నినిర్దిరించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లుగా ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకాం రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుల సంఖ్య 9,381 కాగా.. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఒమిక్రాన్ నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ లు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

అంటే.. ఇప్పుడు అనుసరిస్తున్న పాలసీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పకతప్పదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3610 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఏమైనా ఒమిక్రాన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తెలంగాణ సర్కారు వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.