Begin typing your search above and press return to search.

మిత్రుడు పుణ్య‌మా అని కేసీఆర్ కు కొత్త లొల్లి..

By:  Tupaki Desk   |   26 July 2019 7:38 AM GMT
మిత్రుడు పుణ్య‌మా అని కేసీఆర్ కు కొత్త లొల్లి..
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు పెద్ద త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఇప్ప‌టికే మోడీతో స‌రైన ట‌ర్మ్స్ లేక కిందా మీదా ప‌డుతూ.. క‌మ‌ల‌నాథుల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కాని వేళ‌.. మిత్రుడు అక్బ‌రుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్య‌తో ప‌రేషాన్ అవుతున్న‌ట్లు చెబుతున్నారు.

హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ ఆ మ‌ధ్య‌న తాను క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య నేప‌థ్యంలో.. ఆ మాట బెడిసికొట్టి.. ఎలాంటి చేదు అనుభ‌వం ఎదురైందో తెలిసిందే. అప్ప‌టివ‌ర‌కూ లేని ఐక్య‌త హిందూ ఓట‌ర్ల‌లో రావ‌టం.. ఎట్టి ప‌రిస్థితుల్లో కేసీఆర్ కు గుణ‌పాఠం చెప్పాల‌న్న భావ‌న‌కు వ‌చ్చి.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన వినోద్ కు ఓట‌మి రుచి చూపించిన ప‌రిస్థితి.

ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి అనుభ‌వం ఎప్పుడూ ఎదురుకాని కేసీఆర్ కు తన నోటి నుంచి వ‌చ్చిన బొందుగాళ్ల మాట ఇంత ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని తాను అనుకోలేద‌న్న మాట త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానించిన‌ట్లుగా చెబుతున్నారు. బొందుగాళ్లు అంటూ తాను అన్న‌ది హిందువుల‌ను ఉద్దేశించి కాకున్నా.. అది రివ‌ర్స్ లో త‌మ‌కు చేసిన చేటు చాలానే ఉంద‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతారు. బీజేపీని ఉద్దేశించి అన్న మాట‌.. పార్టీకి చేసిన చేటు నేప‌థ్యంలో.. తాజాగా అక్బ‌రుద్దీన్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య నేప‌థ్యంలో ఏం చేయాల‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారిన‌ట్లు చెబుతున్నారు.

తెలంగాణ‌లో పాగా వేయాల‌ని బీజేపీ త‌పిస్తున్న వేళ‌.. హిందువుల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా అక్బ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్య చేసే డ్యామేజ్ భారీగా ఉంటుందంటున్నారు. ఇప్ప‌టికే అక్బ‌రుద్దీన్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భుత్వం స్పందించాల‌ని.. కేసీఆర్ రియాక్ట్ కావాల‌న్న విన‌తులు.. విజ్ఞ‌ప్తులు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ప‌లు పోలీసుస్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి.

ఇప్పుడిప్పుడు అన్ని పార్టీల‌కు చెందిన నేత‌లు రియాక్ట్ అవుతున్న నేప‌థ్యంలో.. తాము ఈ అంశంపై మాట్లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంద‌న్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ త‌మ బాస్ రియాక్ట్ కాకుంటే.. బొందుగాళ్ల మాట‌తో క‌రీంన‌గ‌ర్ లో ఎలాంటి రియాక్ష‌న్ వ‌చ్చిందో.. దాదాపుగా అలాంటి ప‌రిస్థితే.. తెలంగాణ వ్యాప్తంగా వ‌చ్చే వీలుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అక్బ‌రుద్దీన్ వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ ప‌రేషాన్ అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు. రాంగ్ టైంలో.. రాంగ్ ప్లేస్ లో అక్బ‌రుద్దీన్ మాట్లాడార‌న్న మాట వినిపిస్తోంది.