Begin typing your search above and press return to search.

దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:28 PM GMT
దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్
X
దేశరాజకీయాల్లో కొత్త ట్రెండు మొదలవుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో కొత్త లక్ష్యాలు వస్తున్నాయి. ఇతర పార్టీల విధానాల్లో తప్పులని వేలెత్తి చూపించిన పద్ధతులనే తామూ తలకెత్తుకుంటున్నాయి పోటీ పార్టీలు. ఇటీవల గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విషయంలో ఇది బట్టబయలైంది. ఈ క్రమంలో లౌకికవాద నినాదాల్లో హిందూత్వ ఆకర్షణ కనిపిస్తోంది. ఇంతవరకు వెనుకబడిన తరగతులు, కులాలు, మైనార్టీలు అంటూ లౌకికవాద ఓట్ల లెక్కలు వేసిన కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా బీజేపీ బాటలో నడుస్తున్నాయి. బీజేపీని, నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించే నేతల్లోనూ కొత్త మార్పులొస్తున్నాయి.

మోదీ వ్యతిరేక నేతలు ఇటీవల అనుసరిస్తున్న పద్ధతులు పరిశీలిస్తే వారు దేనికోసం పాకులాడుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నడూ ఆలయాల తలుపులు కూడా చూడని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ కూడా హిందూ ఆలయాల చుట్టూ తిరగడం ప్రదక్షిణలు చేయడం, ముస్లింలను ప్రధాన ఓటుబ్యాంకుగా భావించే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రాహ్మణ సదస్సుకు మద్దతివ్వడం వంటివన్నీ ఇటీవల దేశంలోని మిగతా రాజకీయ నాయకులనూ ఆలోచనలో పడేశాయి.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కొన్నిచోట్ల సొంతంగా, మరికొన్ని చోట్ల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాషాయ పార్టీ ఎదుగుదలకు హిందు ఓటు బ్యాంకే కారణమని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే తామూ హిందూ ఓటర్లకు చేరువ కావాలని తపిస్తున్నాయి.రాహుల్ గాంధీ కేవలం ఆలయాలను సందర్శించడమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా ఆయన హిందూత్వ మూలాలను ప్రబలంగా చెప్పే ప్రయత్నం చేశారు మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో. రాహుల్‌ జంథ్యం ధరిస్తారని, ఆయన హిందువేనని కొత్త ప్రచారం చేశారు. .రాహుల్ కూడా స్వయంగా తాను, తన కుటుంబం శివభక్తులమని చెప్పారు.

మరోవైపు మమతబెనర్జీ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. రీసెంటుగా బెంగాల్లోని బీర్భమ్ జిల్లాలో ‘బ్రాహ్మిణ్‌ అండ్‌ పురోహిత్‌’ పేరుతో సమ్మేళనం జరిగింది. దీనికి తృణమూల్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అనుబ్రాత మండల్‌ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి శాలువా కప్పి, భగవద్గీత, రామకృష్ణ పరమహంస చిత్రపటాలను అందించడం ద్వారా స్వయంగా సత్కరించారు. ముస్లిం మైనార్టీలకు కొమ్ముకాస్తున్న ఒక అధికార పార్టీ పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రంలో ఈ విధమైన చర్యకు సాహసించడం గొప్ప పరిణామమే. వచ్చే ఎన్నికల్లో సత్తాచాటేందుకు భారతీయ జనతాపార్టీ వేగంగా పావులు కదుపుతున్న క్రమంలో తృణమూల్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటకలోనూ హిందుత్వం కోసం ప్రధాన పార్టీల మధ్య పోటీ తప్పదనిపిస్తోంది. గుజరాత్‌ మాదిరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్‌ మిగతావర్గాల తోపాటు హిందువులకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే యోగి, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే.. ప్రతిపక్షాలూ బీజేపీ దారిలోనే సాగుతుండడంతో అది బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి.