Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో కొత్త ట్విస్టు.. ఆ ప‌ద‌వుల‌కు అదే ఆధారం..!

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:29 AM GMT
టీ కాంగ్రెస్ లో కొత్త ట్విస్టు.. ఆ ప‌ద‌వుల‌కు అదే ఆధారం..!
X
తెలంగాణ కాంగ్రెసులో కొత్త ట్విస్టు చోటుచేసుకోనుందా..? ఎప్ప‌టి నుంచో క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్న ఆ ప‌ద‌వుల‌కు స‌రికొత్త నిబంధ‌న విధించారా..? ఆ ప‌నిని స‌మ‌గ్రంగా నిర్వ‌ర్తిస్తేనే ప‌ద‌వులు వ‌రిస్తాయా..? దీంతో అంద‌రూ న‌గ‌రం వ‌దిలి ప‌ల్లె బాట ప‌ట్టారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియ‌మితులై దాదాపు ఏడాది కావ‌స్తున్నా ఇంకా పార్టీపై పూర్తి స్థాయిలో ప‌ట్టు రాలేద‌నే చెప్పాలి. త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న సీనియ‌ర్ల‌ను బుజ్జ‌గిస్తూ రావ‌డంతోనే పుణ్య కాలం కాస్తా గ‌డిచిపోతోంది. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో ఎలాగైనా పార్టీ శ్రేణుల్లో క‌ద‌లిక తీసుకురావాల‌ని రేవంత్ భావించారు. ఇటీవ‌ల రాహుల్ ను ర‌ప్పించి వ‌రంగ‌ల్ లో రైతు డిక్ల‌రేష‌న్ ను ప్ర‌క‌టించారు.

గ‌తంలో కాంగ్రెసుకు ఏ వ‌ర్గాలైతే అండ‌గా ఉన్నాయో వారిని మ‌ళ్లీ ద‌గ్గ‌ర చేసేందుకు ఉద్దేశించిన కార్య‌క్ర‌మ‌మే ఈ రైతు డిక్ల‌రేష‌న్‌. దాదాపు 21 అంశాల‌తో రూపొందించిన డిక్ల‌రేష‌న్ రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డేలానే ఉంది. ఈ విష‌యాన్ని ప్ర‌తి ప‌ల్లెలో.. ప్ర‌తి ఇంటికీ చేర‌వేయాల‌ని రేవంత్ నిర్ణ‌యించుకున్నారు. మే 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు నెల రోజుల పాటు ప‌క‌డ్బందీగా రూపొందించి రైతుల అభిమానాన్ని చూర‌గొనాల‌ని భావించారు. 400 మంది పార్టీ నేత‌ల‌ను ఇందుకు నియ‌మించారు.

అయితే.. మొద‌ట్లో ఈ కార్య‌క్ర‌మం అంతంత మాత్రంగానే జ‌రిగినా.. ఇపుడు ఊపందుకోంది. కొద్ది మంది సీనియ‌ర్లు ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాక‌పోయినా ద్వితీయ శ్రేణి నేత‌లు మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక్కో నేత రోజుకు ఐదారు గ్రామాలు చుట్టుముట్టి రైతులకు అవ‌గాహన క‌ల్పిస్తున్నారు. దీనికి ప్ర‌జ‌ల్లో మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో రేవంత్ ధీమాగా ఉన్నార‌ట‌.

అయితే.. ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఈ ర‌చ్చ‌బండ‌లో ఉత్సాహంగా పాల్గొన‌డానికి మ‌రొక కార‌ణం కూడా ఉంద‌ట‌. అదే డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వుల మార్పు. చాలా జిల్లాల్లో డీసీసీ అధ్య‌క్షులు ఏళ్లుగా పాతుకుపోయారు. ఉత్త‌మ్ హ‌యాంలో నియ‌మించిన వారే ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నారు. వీరిలో చాలా మంది క్రియాశీల‌కంగా ప‌నిచేయ‌డం లేద‌ట‌. కేవ‌లం హైద‌రాబాద్ కే ప‌రిమిత‌మై చుట్ట‌పు చూపుగా జిల్లాల‌కు వెళుతున్నార‌ట‌.

దీంతో.. రేవంత్ స‌రికొత్త ఎత్తుగ‌డ అవ‌లంబించారు. ఈ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం ద్వారా రైతు డిక్ల‌రేష‌న్ ను ఎవ‌రైతే బ‌లంగా జ‌నాల్లోకి తీసుకుపోతారో వారికి జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తాన‌ని చూచాయ‌గా చెప్పార‌ట‌. ఇక‌పై జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వుల‌కు పైర‌వీలు ఉండ‌బోవ‌ని.. పని తీరే ప్రామాణికం అని రేవంత్ తేల్చి చెప్పార‌ట‌. దీంతో ద్వితీయ శ్రేణి నేత‌లంద‌రూ ప‌ల్లె బాట ప‌ట్టారు. ఈ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం త‌ర్వాత ఎవ‌రికి ప‌ద‌వులు వ‌స్తాయో వేచి చూడాలి.