Begin typing your search above and press return to search.

ఏపీకి రైల్వే జోన్‌..కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   20 Jan 2017 7:08 AM GMT
ఏపీకి రైల్వే జోన్‌..కొత్త ట్విస్ట్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రైల్వే జోన్ ప్ర‌క‌టించే విష‌యంలో కొత్త కొత్త ట్విస్ట్‌ లు తెర‌మీద‌కు వ‌స్తున్నారు. విశాఖపట్నంకే రైల్వేజోన్‌ కేటాయిస్తామని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని, ఇటీవలే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎమ్‌. వెంకయ్య నాయుడు విశాఖ పర్యటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా విశాఖలోనే రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని పలు సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చారు. అయితే తూర్పు కోస్తా రైల్వేలో ప్రతీ ఏటా అత్యధికం గా ఆదాయం అర్జించేది విశాఖ రైల్వేడివిజన్‌ మాత్రమే. సుమారు ఏడువేల కోట్లకు పైగా ప్రతీ ఏటా వాల్తేర్‌ డివిజన్‌ నుంచి అత్యధిక ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌ గా ప్రకటిస్తే తమకు ఇబ్బందికరమని కాబట్టి విశాఖ డివిజన్‌ ను తాము వదులుకునేది లేదని తూర్పుకోస్తా రైల్వే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల స‌మ‌యంలో గతంలో మాదిరిగానే ఈ సారి రైల్వేబడ్జెట్‌ లో రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటిస్తారని ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని ప్రచారం ప్రారంభమైంది. అయితే రైల్వేజోన్‌ మాత్రం విశాఖకు కాకుండా విజయవాడకు ప్రకటించే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం. గుంటూరు - గుంతకల్‌ డివిజన్‌ లతో కలిపి విజయవాడను ప్రత్యేక రైల్వేజోన్‌ గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాల్తేర్‌ డివిజన్‌ నుంచి ప్రతీ ఏటా సరుకు రవాణా ద్వారా సుమారు రూ.6500 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. మరో వైపు ప్రజారవాణా ద్వారా సుమారు రూ.370 కోట్లు ఆదాయం లభిస్తుంది. తూర్పు కోస్తా రైల్వేలో అత్యధిక ఆదాయం సాధించిన ఘనత కూడా విశాఖ డివిజన్‌ కే దక్కుతుంది. ఇక్కడ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత నిరుద్యోగులు రైల్వేలో ఉపాది అవకాశాలు కోసం ఒడిశా - బీహార్‌ - మధ్యప్రదేశ్‌ - చత్తీస్‌ గఢ్‌ వంటి ప్రాంతాలకు వెళ్తున్నా సరైన అవకాశాలు లభించడం లేదు. అదే విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ కేటాయిస్తే ఇక్కడ నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రైల్వే కోచ్‌ ల ఫ్యాక్టరీతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా అనేక కొత్త రైళ్లు ఉత్త రాంధ్ర నుంచి ప్రారంభించుకునే అవకాశం కలుగుతుంది.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే అనేక కొత్త రైళ్లు విశాఖ మీదుగా నడుపుతున్నా ఇక్కడ నుంచి రిజర్వేషన్‌ సదుపాయం లేకపోవడం, కొన్ని రైళ్లకు కనీసం బుకింగ్‌ కౌంటర్‌ కూడా తెరవకపోవడం వల్ల అనేక రైళ్లు ఖాళీగా వెళ్తున్నా ఇక్కడ ప్రయాణికులకు ప్రయాణించే అవకాశం లేదు. మరో వైపు విశాఖకు సమీపంలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌ వరకు దక్షిణ మధ్య రైల్వే ఆదీనంలోనే ఉంది. దీంతో ఇప్పుడు విశాఖ డివిజన్‌ తూర్పు కోస్తా రైల్వేలో ఉండడం వల్ల ఆయా ప్రాంత ప్రజలకు తీరని నష్టం కలుగుతుంది. తూర్పు కోస్తా రైల్వేలో ప్రతీ ఏటా అత్యధికం గా ఆదాయం అర్జించేది విశాఖ రైల్వేడివిజన్‌ మాత్రమే. సుమారు ఏడువేల కోట్లకు పైగా ప్రతీ ఏటా వాల్తేర్‌ డివిజన్‌ నుంచి అత్యధిక ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌ గా ప్రకటిస్తే తమకు ఇబ్బందికరమని కాబట్టి విశాఖ డివిజన్‌ ను తాము వదులుకునేది లేదని తూర్పుకోస్తా రైల్వే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు విజయవాడ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించి భవిష్యత్తులో విశాఖ డివిజన్‌ ను కూడా విజయవాడ రైల్వేజోన్‌లో కలపాలన్నది ఉన్నత వర్గాల వ్యూహంగా తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/