Begin typing your search above and press return to search.

లక్నో ఎపిసోడ్ పై కొత్త ట్విస్టు..స్టేషన్ లో ఏం జరిగిందో చెప్పిన క్యాబ్ డ్రైవర్

By:  Tupaki Desk   |   4 Aug 2021 4:53 AM GMT
లక్నో ఎపిసోడ్ పై కొత్త ట్విస్టు..స్టేషన్ లో ఏం జరిగిందో చెప్పిన క్యాబ్ డ్రైవర్
X
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న వేళ.. రోడ్డు దాటే క్రమంలో ఒక క్యాబ్ డ్రైవర్ తనను ఢీ కొనే ప్రయత్నం చేశాడంటూ ఒక మహిళ.. సదరు క్యాబ్ డ్రైవర్ ను ఎడాపెడా కొట్టేయటంతో పాటు.. అడ్డు వచ్చిన వారిపైనా చేయి చేసుకోవటం.. నిలువరించేందుకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ మీద గుస్సా ప్రదర్శించిన వైనం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో తొలుత క్యాబ్ డ్రైవర్ ది తప్పని భావించినా.. సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత లక్నో అమ్మాయి ప్రియదర్శిని చేసిన రచ్చ ఏమిటో అర్థమైన పరిస్థితి. దీంతో.. నిజం తెలిసి అందరూ క్యాబ్ డ్రైవర్ కు మద్దతుగా నిలవటం.. లక్నో అమ్మాయిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తటం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగటం తెలిసిందే.

దీంతో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో సదరు మహిళ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా ఆమెను అదుపులోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. చేయని తప్పునకు బాధితుడిగా మారిన క్యాబ్ డ్రైవర్ జరిగిన ఉదంతానికి సంబంధించి మరిన్ని వాస్తవాల్ని వెల్లడించాడు. మహిళ చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు తను చెప్పేది వినకుండా స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు. ‘ఆవేశంగా వచ్చి నా కార్లోని ఫోన్ తీసేసుకుంది. దాన్ని ముక్కలుముక్కలుగా పగలకొట్టింది. కారు సైడ్ మిర్రర్ సైతం పగలుల కొట్టింది. మమ్మల్ని ఇద్దరిని స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ తనపై మాత్రం ఎలాంటి చర్యా తీసుకోలేదు. రోజంతా పోలీసులు నాకు ఎలాంటి ఫుడ్ పెట్టలేదు. ఆమె చెప్పిందే విన్నారు. నా తప్పేంటి? అని పదే పదే అడిగినా పట్టించుకోలేదు. నేనో పేద డ్రైవర్ని.. నాకేం అక్కర్లేదు.. నా ఆత్మగౌరవాన్ని నాకు తిరిగి ఇస్తే చాలు. నాకు న్యాయం కావాలి’’ అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అతడికి మద్దతు ఇస్తున్న వారి సంఖ్య పెరిగింది. పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జరిగిన ఉదంతంపై యువతి స్పందిస్తూ.. ఇప్పటికి తన తప్పేం లేదని.. క్యాబ్ డ్రైవర్ దే అంతా తప్పనట్లుగా మాట్లాడటం గమనార్హం. క్యాబ్ డ్రైవర్ తన కారును జీబ్రా క్రాసింగ్ వైట్ లైన్ మీదకు పోనిచ్చాడని.. ఇది రూల్ ను బ్రేక్ చేసినట్లేనని.. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తే.. తప్పు ఎవరిదో తేలుతుందన్నారు. ఈ ఘటనలో తాను చనిపోయి ఉంటే.. తన శవానికి పోస్టుమార్టం చేసి ఇంటికి పంపేవారు కదా? అని ప్రశ్నిస్తోంది. ఆమె వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యాబ్ డ్రైవర్ చేసింది తప్పే అయినా.. ఇలా నడిరోడ్డు మీద అంతలా దాడి చేయటం ఏమిటని యువతిని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా లక్నో ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు.. యువతిని.. పోలీసుల్ని పలువురు తప్ప పడుతున్నారు.మరి.. రచ్చకు కారణమైన ప్రియదర్శినిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.