Begin typing your search above and press return to search.

త్వరలో మళ్లీ కోవిడ్ ఉధృతి..

By:  Tupaki Desk   |   5 May 2022 8:11 AM GMT
త్వరలో మళ్లీ కోవిడ్ ఉధృతి..
X
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని గుప్పిట పట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ మనల్ని వీడిపోవడం లేదు. చైనాలో మరోసారి విజృంభించి అక్కడ లాక్ డౌన్ కు కారణమైంది. నగరాల్లో ప్రజలను ఆకలి దప్పులకు గురిచేస్తోంది. అయితే చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. మళ్లీ ఆ దేశాన్నే వణికిస్తోంది. ఇంకా ఈ ముప్పు ముగిసిపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ త్వరలోనే మళ్లీ ఉగ్రరూపం దాల్చవచ్చని.. డెల్టా లేదా మరో కొత్త వేరియంటే ఇందుకు కారణమవుతుందని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలు వచ్చే రెండు మూడు నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని కూడా నిర్ధారణకు వచ్చారు.

ఈ మేరకు ఇజ్రాయెల్లోని బెన్-గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా బీర్-షెవా నగరంలోని మురుగునీటిని సేకరించిన పరిశోధకులు.. వాటిలోని ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల మధ్య పరస్పర చర్యలు జరుగుతున్నట్లు ప్రత్యేక నమూనా సాయంతో గుర్తించారు.

డెల్టా వేరియంట్ అంతకుముందున్న వైరస్ రకాలను తుడిచిపెట్టేసింది. దాని తర్వాత వచ్చిన ఒమిక్రాన్ మాత్రం డెల్టాను ఏమీ చేయలేకపోయింది.

త్వరలోనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వాటంతట అవే తెరమరుగయ్యే అవకాశముంది. డెల్టా మాత్రం రహస్యంగా తన వ్యాప్తిని కొనసాగిస్తూ మరింత శక్తివంతంగా మారవచ్చు. లేదంటే కొత్త వేరియంట్ కు దారితీయవచ్చు.

డామినెంట్ వేరియంట్లు ఎప్పుడూ వాటి కంటే ముందున్న వైరస్ ల కంటే శక్తిమంతంగానే ఉంటాయి. ఆ ప్రకారం చూస్తే డెల్టా లేదా మరో కొత్త వేరియంట్ మరోసారి కోవిడ్ ఉధృతి తీసుకురావడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అంటే ప్రపంచానికి ఈ కరోనా ముప్పు మరోసారి రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.