Begin typing your search above and press return to search.

గాంధీ ఆసుపత్రి కొత్త వెర్షన్.. రానున్న రోజుల్లో ‘ప్రయోగశాల’?

By:  Tupaki Desk   |   15 May 2020 2:30 PM GMT
గాంధీ ఆసుపత్రి కొత్త వెర్షన్.. రానున్న రోజుల్లో ‘ప్రయోగశాల’?
X
ప్రపంచాన్ని చుట్టేసిన మాయదారి రోగానికి చికిత్స చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేసుకోవటం తెలిసిందే. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఆసుపత్రిలో 1100పైగా బెడ్లు ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా మాయదారి రోగం ఎవరికి అంటుకున్నా.. తొలుత తీసుకొచ్చేది గాంధీకే. కొన్ని కేసుల్ని మాత్రం హైదరాబాద్ లోని మరికొన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గాంధీ ఆసుపత్రిని రానున్న రోజుల్లో మాయదారి రోగానికి చెక్ పెట్టే మందులకు.. వ్యాక్సిన్లకు ప్రయోగశాలగా వాడే అవకాశం ఉందా? అంటే అవునన్న విషయం బయటకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న రోగానికి మందు కనిపెట్టే పనిలో పలు సంస్థలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటికి భవిష్యత్తులో ఓకే చేస్తారు. అలా ప్రభుత్వ ఆమోదించిన వాటిని ప్రయోగించేందుకు గాంధీ ఆసుపత్రిని ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఒప్పందం రానున్న రోజుల్లో జరుగుతుందని చెబుతున్నారు. అన్ని వసతులతో పాటు.. పెద్ద ఎత్తున రోగులు చికిత్స పొందే గాంధీలో అయితే.. బాగుంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. రానున్న వారం.. పది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది. ఇదిలా ఉంటే.. మాయదారి రోగంతో ఇబ్బంది పడుతున్న ఎంపిక చేసిన రోగులకు ప్లాస్మా విధానంలో చికిత్స చేసేందుకు వీలుగా ఇప్పటికే గాంధీ అనుమతులు పొందింది.

తాజాగా కొందరు రోగుల వివరాల్ని ఐసీఎంఆర్ కు పంపారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన పక్షంలో ప్లాస్మా చికిత్సను షురూ చేస్తారు. తాజా పరిణామాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో గాంధీ ఆసుపత్రి మరింత కీలకంగా మారటమే కాదు.. మాయదారి రోగానికి చెక్ పెట్టే పరిణామాలకు వేదిక అయ్యే అవకాశం ఉందని చెప్పక తప్పదు.