Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బకు ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం

By:  Tupaki Desk   |   28 March 2020 4:30 PM GMT
కరోనా దెబ్బకు ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం
X
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదేలు చేస్తోంది. పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ వైరస్‌ బారిన పడి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్‌ వ్యాప్తితో స్తంభించిపోయింది. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి పడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇన్నాళ్లు వివిధ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో సతమతమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కరోనాకు తలొగ్గింది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలోకి కరోనా నెట్టేసింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఆ దేశంలో తీవ్రంగా వ్యాపించి ఆ దేశాన్ని ప్రమాదంలో నెట్టివేయగా అక్కడి నుంచి పాకిన వైరస్‌ మొత్తం ప్రపంచాన్నే చుట్టేసింది. రోజురోజుకు ఆ వైరస్‌ తీవ్రమవుతుంటే ప్రపంచ దేశాలు తమ తలుపులు మూసేసుకున్నాయి. అంతర్జాతీయ వ్యాపారం, లావాదేవీలు విరమించుకున్నాయి. ఎగుమతులు, దిగుమతులు పెద్ద సంఖ్యలో తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం పడిందని ఐఎంఎఫ్‌ అధ్యక్షులు క్రిస్టలినా జార్జివా ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా నివారణకు అన్ని దేశాలకు భారీగా నిధులు అవసరమవుతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆయా దేశాల్లో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగాలంటే 2.5లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. కరోనా ప్రభావం మరికొన్నాళ్ల పాటు అంతర్జాతీయ వ్యాపారంపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని అభిప్రాయ పడింది. సత్వరమే నివారణ చర్యలు తీసుకుంటే ఆ వైరస్‌ కట్టడిలోకి వస్తే కొంత కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ సూచిస్తోంది.