Begin typing your search above and press return to search.

కరోనా సోకిన వారిలో కొత్త వైరస్.. దిల్లీలో నిర్ధారణ!

By:  Tupaki Desk   |   3 July 2021 3:32 AM GMT
కరోనా సోకిన వారిలో కొత్త వైరస్.. దిల్లీలో నిర్ధారణ!
X
కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల నుంచి ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెలలో విశ్వరూపం చూపించింది. ఎంతో మంది వైరస్ ధాటికి బలయ్యారు. కాగా వైరస్ సోకిన వారిని మరో వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొవిడ్ తో పాటు ఇంకో వైరస్ ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

దిల్లీలోని గంగారం ఆస్పత్రిలో ఐదుగురు వ్యక్తుల్లో కరోనాతో పాటు సైటోమెగలోవైరస్ నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వారిలో ఒకరు మరణించినట్లు వెల్లడించారు. సీఎంవీ అనేది ఒక సాధారణ వైరస్ అని చెబుతున్నారు. ఇది హెర్పెస్ వైరస్ జాతికి చెందిందని వైద్య నిపుణులు గుర్తించారు. మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత జీవితాంతం ఉంటుందని పేర్కొన్నారు.

కరోనాలాగే ఇది రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారిపై చాలా తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, మూత్రం వంటి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లను కలిగిస్తుందని వెల్లడించారు.

రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వారిలో విరేచనాలు, కడుపు నొప్పి, మలంలో రక్తం, బరువు తగ్గడం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, అలసట, జ్వరం, వాపు మొదలైన సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. మలంలో రక్తం అతి తీవ్రమైన లక్షణమని హెచ్చరిస్తున్నారు.

కరోనా చికిత్సకు ఉపయోగించే అధిక స్టెరాయిడ్ల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. సకాలంలో గుర్తించగలిగితే చికిత్స ద్వారా నయం చేయవచ్చునని చెబుతున్నారు. ఈ వైరస్ ఒకసారి సోకితే పూర్తిగా కోలుకునే చికిత్స ఇప్పటి వరకు లేదు. వైరస్ ప్రభావంతో కలిగే సమస్యలను తగ్గించడానికి మందులు ఉన్నాయి తప్పా పూర్తిగా బయటపడే చికిత్స లేదని అంటున్నారు. కొన్ని యాంటీవైరల్ మందులతో పరిస్థితిని అదుపు చేయవచ్చునని సూచించారు.

ఈ కరోనా కాలంలో మరికొన్నాళ్లు జాగ్రత్తగా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు. అందరూ టీకా తీసుకొని వీలైనంతగా బయటకు రాకుండా ఉండాలని చెబుతున్నారు. టీకా తీసుకున్నా విధిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించడం మంచిదని సూచించారు. ఈ వర్షాకాలంలో కరోనాతో పాటు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిదని హెచ్చరిస్తున్నారు.