Begin typing your search above and press return to search.

కరోనా విలయతాండవం..బ్రిటన్ లో ఒకే రోజు 500 మంది!

By:  Tupaki Desk   |   2 April 2020 9:10 AM GMT
కరోనా విలయతాండవం..బ్రిటన్ లో ఒకే రోజు 500 మంది!
X
కరోనాతో ప్రపంచం మొత్తం వణికి పోతోంది. అమెరికా సైతం ఈ కరోనా దెబ్బకి వణికిపోతోంది. ఇక తాజాగా కరోనా బీభత్సం బ్రిటన్ లో కూడా మొదలైంది. బ్రిటన్ దేశంలో ఒక్కరోజే 500 మందికి పైగా కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. బుధవారం 563 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ తన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటివరకు బ్రిటన్ లో 2,352 మంది మరణించారని తెలిపింది. స్వయంగా కరోనా మహమ్మారి బారిన పడిన ప్రధాని బోరిస్ జాన్సన్.. ఇది చాలా విషాదకరమైన రోజు అంటూ చెప్పుకొచ్చారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న ఆయన.. అనేకమంది వైద్య సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నారని, కొంతమంది తమ ఇళ్లలోనే ఉండిపోయారని, ఈ కారణంగా దేశంలో కరోనా రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఏర్పడిందని అన్నారు.

వీరంతా పూర్తిగా కోలుకునేంతవరకు పరిస్థితి ఇలాగే ఉంటుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. కాగా .. కరోనా రాకాసికి గురైన 71 ఏళ్ళ ప్రిన్స్ చార్లెస్ మంగళవారం సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చారు. దేశ నేషనల్ హెల్త్ కమిషన్ మంచి సేవలందిస్తోందని తన వీడియో సందేశంలో ఆయన తెలిపారు. అలాగే ఈ కరోనా సంక్షోభం నుండి దేశం త్వరగా కోలుకుంటుంది. అటు ఈ మహమ్మారిని అదుపు చేసే క్రమంలో.. బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థ సుమారు 36 వేల మంది సిబ్బందిని సస్పెండ్ చేయాలనే యోచనలో ఉంది. అనేక విమాన సర్వీసులు నిలిచిపోయిన ఫలితంగా ఇక ఈ స్టాఫ్ అవసరం ప్రస్తుతానికి లేదని ఈ సంస్థ భావిస్తున్నట్టు కనబడుతోంది.

ఈ సిబ్బందిలో కేబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజనీర్లు ఉన్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న థామస్ హార్వే అనే సీనియర్ వైద్యుడు కూడా కరోనాతో మృతి చెందారు. ఓ కరోనా రోగి నుంచి ఆయనకు ఇన్ఫెక్షన్ సోకింది. 20 ఏళ్లుగా ఆయన వివిధ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య చికిత్సలు చేస్తూ వచ్చారు. ఇకపోతే , ఈ కరోనా అమెరికాలో కూడా తన ప్రతాపాన్ని చూపుతుంది. తాజాగా బుధవారం ఆరు వారాల బేబీ కరోనా సోకి మృతి చెందింది. ప్రపంచంలో ఇంత చిన్న వయస్కురాలు మరణించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే దేశంలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ ఏ వయస్సువారికీ సురక్షితం కాదనే అంశం స్పష్టమవుతోందన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలతో అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని వైద్యం కోసం గతవారం ఆసుపత్రిలో చేర్పించారు.