Begin typing your search above and press return to search.

నాలుగు ఎకరాల్లో సొంతం దేశం

By:  Tupaki Desk   |   2 Nov 2015 6:19 AM GMT
నాలుగు ఎకరాల్లో సొంతం దేశం
X
ఒక దేశం అంటే ఎంత వైశాల్యం ఉంటుంది? ఎవరు ఎంత చెప్పినా.. నాలుగు ఎకరాల్లో ఒక దేశం ఉంటుందంటే మాత్రం ఎవరూ నమ్మరు. కానీ.. నాలుగంటే నాలుగు ఎకరాల్లో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి ఆసక్తికర కోణాన్ని ఆవిష్కరిస్తున్న ఒక పెద్దమనిషి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చట్టబద్ధత ఉండదని తెలిసినా.. తన ప్రయత్నం తాను చేసుకుంటానని చెబుతూ.. ఆ దిశగా పని చేస్తున్న వ్యవహారంగా దీన్ని చెప్పొచ్చు. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన జక్ లాండ్స్ బర్గ్ అనే వ్యక్తి ఉటా ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దాన్ని తన సొంత దేశంగా ప్రకటించుకున్నారు.

చట్టబద్ధత ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెట్టి.. ‘‘శూన్యం నుంచి ఎంతో కొంత’’ అన్న నినాదంతో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ‘‘రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్’’గా పేరు పెట్టుకున్నారు. దానికో జాతీయ జెండాను తయారు చేసుకున్నాడు. అంతేకాదు.. తన దేశాన్ని 24 గంటలూ రక్షణ వ్యవహారాల్ని చూసుకునేందుకు ఒక రోబోను ఏర్పాటు చేసుకున్నాడు. తన దేశ సరిహద్దుల్లోకి అడుగు పెట్టాలంటే ముందస్తు అనుమతితో పాటు.. అధికారిక పాస్ పోస్ట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నాడు.

సెంట్రీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోబో అనుమతి తీసుకొని లోపలకు అడుగు పెట్టిన వెంటనే అధికారిక పాస్ పోర్ట్ స్టాపింగ్ జరిగిపోతుందని ఇతగాడు చెబుతున్నాడు. ఒక కొత్త తరహా సృజనతోకళాత్మకంగా పథకంగా నేనూ.. నా దేశం అన్న కాన్సెప్ట్ ను అందరికి పరిచయం చేసే ఉద్దేశ్యంతోనే తానీ పని చేస్తున్నట్లుగా జక్ చెబుతున్నాడు. తన స్థలానికి క్రమం తప్పకుండా పన్నుచెల్లిస్తున్న ఇతగాడు తన సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడనని చెబుతున్నాడు. నిజమే.. ఒక దేశంలో ఉంటూ.. అందులోని కొంత భాగాన్ని సొంతదారుడై.. చట్టవిరుద్దంగా ఏ పని చేయనంత కాలం.. సదరు స్థలం అతగాడి రాజ్యమే కదా? అయినా ఎవరి ఇల్లు ఎవరి రాజ్యం కాకుండా పక్కోడి రాజ్యం అవుతుందా ఏమిటి..?