Begin typing your search above and press return to search.

టి20 ప్రపంచ కప్ ఎవరు గెలిచినా తొలిసారే!

By:  Tupaki Desk   |   12 Nov 2021 11:30 AM GMT
టి20 ప్రపంచ కప్ ఎవరు గెలిచినా తొలిసారే!
X
టి20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ ముగిశాయి. మాజీ చాంపియన్లయిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఇంటి బాట పట్టాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్స్ కు చేరాయి. వాస్తవానికి ఫైనల్స్ల్ ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతుందని అంతా భావించారు. సూపర్ 12 దశలో అదరగొట్టిన ఈ జట్లు.. హాట్ ఫేవరేట్లయ్యాయి.

కానీ, సెమీస్ లో అంతా తలకిందులైంది. దాదాపు ఒకే విధంగా సాగిన సెమీఫైనల్స్ల్ఖ్ లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్, పాక్ పై ఆసీస్ గెలుపొందాయి. దీంతో మాజీ చాంపియన్లు రెండూ నిష్క్రమించాయి. ఇప్పుడు కివీస్, ఆసీస్ ఎవరు గెలిచినా.. కొత్త విజేతను చూస్తాము.

ఆ రెండు వస్తాయనుకుంటే ఈ రెండు..

బలమైన బ్యాటింగ్, అందుకుతగ్గ బౌలింగ్ తో టి20 ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టాయి పాకిస్థాన్, ఇంగ్లాండ్. లీగ్ దశలో ఈ జట్ల ఆటను చూస్తే వీటిని ఓడించడం సాధ్యమా? అన్న అనుమానం వచ్చింది. లీగ్ దశలో పాక్ అజేయంగా నిలవగా.. ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే ఓడింది. ఇక సెమీస్ లోనూ రెండు జట్లూ అద్భుతంగా ఆడాయి.

బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో 16వ ఓవర్ వరకు ఇంగ్లండ్ దే విజయం అనుకున్నారంతా. కానీ, 17వ ఓవర్ తో అంతా మారిపోయింది. ఇంగ్లండ్ పేసర్ జోర్డాన్ వేసిన ఈ ఓవర్లో నీషమ్ ఏకంగా 23 పరుగులు రాబట్టి కివీస్ ను గెలిపించాడు. 18వ ఓవర్లో అతడు ఔటైనా, మిగతా పనిని డారిల్ మిచెల్ పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లిష్ జట్టు చేదు అనుభవం మిగిలింది. ఇక గురువారం పాకిస్థాన్, ఆస్ట్రేలియా సెమీస్ కూడా దీనికి డూప్లికేటా? అనే తరహాలో సాగింది.

ఈ మ్యాచ్ లోనూ 15వ ఓవర్ వరకు పాక్ దే గెలుపులా కనిపించింది. అప్పటికి ఆసీస్ 30 బంతుల్లో 62 పరుగులు చేయాలి. కానీ, ప్రధాన బ్యాట్స్ మన్ అంతా ఔటైన నేపథ్యంలో కష్టమే అనిపించింది. అయితే, మాథ్యూ వేడ్ , స్టొయినిస్ పరిస్థితిని మార్చివేశారు. వేడ్ విధ్వంసంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే కంగారూలు గెలిచేశారు.

సెమీస్ మ్యాచ్ లు భలేభలే

బ్యాటింగ్ కు సహకరించని పిచ్ ల కారణంగా ఈ టి20 ప్రపంచ కప్ లో లీగ్ దశలో కొన్ని మ్యాచ్ లు నిస్సారంగా జరిగి ఉండొచ్చుగాక. తక్కువ స్కోర్ల మ్యాచ్ లు బోర్ కొట్టి ఉండొచ్చు గాక. పాక్, కివీస్ మీద ఓడడంతో ఆఖరుకు టీమిండియా మ్యాచ్ లు సైతం చూడాలని అనిపించ లేదు. కానీ, సెమీ ఫైనల్స్ మాత్రం అదరగొట్టేశాయి.

అటు పరుగుల పరంగా గానీ, వికెట్ల పరంగా గానీ రంజుగా సాగాయి. అంటే.. బ్యాటింగ్, బౌలింగ్ కు పిచ్ లు సమంగా సహకరించాయి. తొలి సెమీస్ లో ఇంగ్లండ్ 166 పరుగులు చేస్తే కివీస్ దానిని ఛేదించింది. రెండో సెమీస్ లో పాక్ 176 పరుగులు చేస్తే ఆసీస్ అధిగమించింది. దుబాయ్, అబుధాబిలోని పిచ్ ల తీరును పరిశీలిస్తే ఈ స్కోర్లు మంచి స్కోర్లే. వీటిని ఛేదించిన విధం బట్టి చూస్తే పిచ్ లు బ్యాటింగ్, బౌలింగ్ రెంటికీ సమానంగా స్పందించినట్లు స్పష్టమవుతోంది.

ఆసీస్, కివీస్.. ఫైనల్స్ల్ఖ్ల్ లో గెలిచేదెవరు?

వన్డేలు, టెస్టుల్లో బలమైన జట్టయిన ఆసీస్ టి20 లకు వచ్చేసరికి తేలిపోతుంటుంది. మరీ పొట్టి ప్రపంచకప్ లో దాని ప్రదర్శన చెప్పుకోదగ్గట్టు లేదు. 2010లో మాత్రమే కంగారూలు ఫైనల్స్ కు చేరారు. ఇక కివీస్ టి20ల్లో మంచి జట్టే అయినా.. ఎప్పుడూ ఫైనల్స్ కు రాలేదు. 2007, 2016లో సెమీ ఫైనల్స్త్ వరకు చేరగలిగింది. ఇప్పడు మాత్రం రెండు జట్లూ కప్ ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచాయి.

ఫేవరెట్ ఎవరంటే..?

ఫైనల్స్ చేరిన రెండింటిలో ఫేవరెట్ ఎవరూ అంటే ఆస్ట్ట్రేలియాకు కొంత ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. కివీస్ ను తక్కువ అంచనా వేయలేకున్నా.. పెద్ద మ్యాచ్ లలో కఠిన ప్రత్యర్థిని ఎదుర్కొనడంలో న్యూజిలాండ్ తడబడుతుంది. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ దీనికి ఉదాహరణ. కాగా, ఆసీస్ కు మాత్రం ఈ తడబాటు లేదు. దశాబ్దాలుగా అగ్ర జట్టుగా వెలుగొంది.. ఎన్నో మ్యాచ్ లను ప్రత్యర్థుల చేతి నుంచి లాగేసుకుని గెలిచిన సత్తా ఆ జట్టు సొంతం. ఇక ఎంతటి గట్టి ప్రత్యర్థి అయినా.. తట్టుకుని నిలబడి నెగ్గడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. దీన్ని బట్టి చూస్తే కంగారూలకే కొంత ఎడ్జ్ కనిపిస్తున్నా.. టి20ల్లో ఏం జరుగుతుందో? ఎవరూ చెప్పలేం కదా?

కేన్ కివీస్ కు భలే చాన్స్...

మిస్టర్ కూల్ కేన్ విలియమ్సన్ సారథ్యంలో అద్బుతంగా దూసుకెళ్తున్న న్యూజిలాండ్ ముంగిట ప్రస్తుతం భలే చాన్సుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచే అవకాశం ఆ జట్టుకు దక్కనుంది. 2019 ప్రపంచ కప్ ఫైనల్లో త్రుటిలో టైటిల్ చేజారి.. విశ్వ విజేతగా నిలిచే ఘనతను చేజార్చుకుంది కివీస్. అయితే, 2021 లో టెస్టు చాంపియన్ షిప్ ను నెగ్గి కొంత ఊరట పొందింది. ఇప్పుడు టి20 కప్ ను గెలుచుకుంటే.. చరిత్రలో నిలిచే అరుదైన ఫీట్ ను అందుకుంటుంది. విలియమ్సన్ సారథ్యానికి అదో కలికితురాయిగా నిలిచిపోతుంది.