Begin typing your search above and press return to search.

కరోనాను ఎలా ఖతం చేయాలో ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలంతే

By:  Tupaki Desk   |   18 Aug 2021 3:37 AM GMT
కరోనాను ఎలా ఖతం చేయాలో ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలంతే
X
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా కొన్ని దేశాల్ని మాత్రం టచ్ చేయని వైనం తెలిసిందే. ఒకవేళ.. మిగిలిన దేశాల మాదిరి.. ఆయా దేశాలకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు.. దాని అంతు చూసేందుకు సదరు దేశాలు ప్రదర్శించే విధానాలు చూస్తే.. కరోనా విషయంలో ఎంత కేర్ ఫుల్ గా ఉండాలన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. ప్రపంచ దేశాలు కరోనాతో కిందా మీదా పడుతున్న వేళలో.. అందుకు భిన్నంగా దాని ఊసే లేని రీతిలో ఉన్న చాలా తక్కువ దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. అలాంటి ఆ దేశంలో తాజాగా ఒక పాజిటివ్ కేసు నమోదైంది.

దీంతో..న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. కరోనా విషయంలో ఆ దేశం ఎంత కేర్ ఫుల్ గా ఉందన్న విషయాన్ని చూస్తే.. మాయదారి మహమ్మారి విషయంలో అప్రమత్తత ఎంత అవసరమన్న విషయాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. తాజాగా న్యూజిలాండ్ లో ఒక కరోనా కేసు బయటకు వచ్చింది.
అంతే.. వెంటనే అలెర్టు అయిన న్యూజిలాండ్ ప్రభుత్వం ఆ దేశంలో మూడురోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు దేశ ప్రధాని జెసిందా ఆర్డెర్న్. మంగళవారం అర్థరాత్రి నంుచి లాక్ డౌన్ మొదలవుతుందని చెప్పిన ఆమె మాటలతో ఒక్కసారిగా దేశంలోని సూపర్ మార్కెట్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. న్యూజిలాండ్ డాలర్ విలువ పడిపోయింది.

అక్లాండ్ లోని ఒక న్యూజిలాండ్ పౌరుడికి కరోనా సోకింది. అతను కోరమాండల్ ప్రాంతాన్ని కూడా సందర్శించినట్లుగా తేలటంతో.. ఈ రెండు ప్రాంతాల్లో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను విధిస్తున్నట్లుగా ప్రధాని ప్రకటించారు. సదరు వ్యక్తికి కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని తేల్చే ప్రయత్నంలో అధికారులు ముమ్మురంగా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చెలరేగినప్పటికి న్యూజిలాండ్ లో మాత్రం దాని ఆటలు సాగలేదనే చెప్పాలి. ఇప్పటివరకు కేవలం 32 మంది మాత్రమే దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోవటం గమనార్హం. అంతేకాదు.. కరోనా విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. న్యూజిలాండ్ లాంటి సంపన్న దేశంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నట్లుగా చెప్పాలి. ఇప్పటివరకు ఆ దేశంలో 32 శాతం మందికి మొదటి డోసు.. 18 శాతం మందికి రెండో డోసు వ్యాక్సిన్లు పూర్తి అయ్యాయి. ప్రపంచమంతా డెల్టా వేరియంట్ చెలరేగిపోతున్న వేళ.. తమ దేశానికి దాని ముప్పు లేకుండా చేయటం కోసం జెసిండా సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక్క కేసు వెలుగు చూస్తే.. దేశ వ్యాప్తంగా మూడు రోజులు లాక్ డౌన్ విధించిన ఆమె తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.