Begin typing your search above and press return to search.

న్యుజిలాండ్‌ లో భూకంపం...సునామీ హెచ్చ‌రిక‌

By:  Tupaki Desk   |   14 Nov 2016 4:39 AM GMT
న్యుజిలాండ్‌ లో భూకంపం...సునామీ హెచ్చ‌రిక‌
X
శక్తిమంతమైన భూకంపం న్యూజిలాండ్‌ ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటలకు క్రైస్ట్‌ చర్చ్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు చోటుచేసుకొన్నాయని పేర్కొంది. దక్షిణ తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికలను నేషనల్ సివిల్ ఢిఫెన్స్ ఆర్గనైజేషన్ జారీ చేసింది. ఉత్తర-ఈశాన్య క్రైస్ట్‌ చర్చ్‌ కు 57 మైళ్ల దూరంలోని అంబెర్లే పట్టణానికి సమీపాన 3.1 మైళ్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. వెల్లింగ్టన్ - షెవియట్ తదితర పట్టణాల్లో స్వల్పంగా భూమి కంపించిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే సునామీ రావడానికి అవకాశాలు ఉన్నాయనే వార్త‌లు సైతం వెలువ‌డ్డాయి. అయితే తాజా ప్రకంపనలు అంత తీవ్రత లేదని - ఒకవేళ సునామీ వస్తే దాని ప్రభావం కొన్ని గంటలపాటు కొనసాగే అవకాశముందని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూజిలాండ్ ప్రభుత్వం సూచించింది. అయితే ఎలాంటి ఆస్తినష్టం జరుగలేదని, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోలేదని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు."గాఢ నిద్రలో ఉండగా ఇళ్లంతా ఒక్కసారిగా కదిలినట్టు అనిపించింది. భవనం గాల్లోకి లేచిపోతుందా అనే భ్రమ కలిగేంతగా ప్రభావం కనిపించింది" అని స్థానికురాలు తెలిపారు. 2011 ఫిబ్రవరిలో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంప కారణంగా క్రైస్ట్‌ చర్చ్‌ లో 185 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌ లో న్యూజిలాండ్ తూర్పు తీర ప్రాంతంలో 7.1 తీవ్రత ఉన్న భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.

ఇదిలాఉండ‌గా అర్జెంటీనాలో సైతం ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదయింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. చిలీ సరిహద్దులోని లా రియోజా రాష్ట్రంలోని చిలెసిటో ప్రాంతం కేంద్రంగా భూమిలో 100 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/