Begin typing your search above and press return to search.

రష్యా యుద్ధం: నిరాశ్రయులుగా మారిన 4.8 మిలియన్ ఉక్రెయిన్ చిన్నారులు

By:  Tupaki Desk   |   12 April 2022 11:30 PM GMT
రష్యా యుద్ధం: నిరాశ్రయులుగా మారిన 4.8 మిలియన్ ఉక్రెయిన్ చిన్నారులు
X
ఉక్రెయిన్ పై రష్యా సైనికుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నెలరోజులుగా రష్యన్ దళాలు ఉక్రెయిన్ లోని ప్రాంతాలపై బాంబులతో విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీవ్ తోపాటు పలు పట్టణాలు శ్మశాన దిబ్బలుగా మారాయి. తమ నగరాలు కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాడుతోంది.

ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యన్ సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. రష్యన్ సైనికుల లైంగిక దాడుల ముప్పును తప్పించుకునేందుకు ఉక్రెయిన్ పట్టణంలోని ఇవాన్ కివ్ అనే బాలిక తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులతో అనేక మంది పిల్లలు నిరాశ్రయులుగా మారుతున్నారు. మహిళలపై రష్యా సైనికుల హింస, పిల్లల రక్షణ వంటి విషయాలపై ఐక్యరాజ్యసమితిలోని ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఐరాసాలో యుద్ధం ఆగాలని యూఎన్ మహిళా ఏజెన్సీ డైరెక్టర్ పిలుపునిచ్చారు. రష్యా సైన్యం నుంచి ఎదురవుతున్న అత్యాచారం లైంగిక హింస గురించి ఉక్రెయిన్ మహిళల వ్యాఖ్యలను ఎక్కువగా వింటున్నామని.. న్యాయం,జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఈ ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలన్నారు.

అయితే భద్రతా మండలిలోని ఇతర సభ్యులుచేసిన ఆరోపణలను రష్యా మరోసారి తిరస్కరించింది. యూఎన్ లోని రష్యన్ డిప్యూటీ రాయబారి డిమిత్రి పాలియన్ స్కీ మాట్లాడుతూ అమాకత్వపు ఊహాగానాలకు తాము వివరణ ఇవ్వమని అన్నారు. ఉక్రెయిన్ భవిష్యత్తును కాపాడడానికే ప్రత్యేక సైనిక చర్య చేపట్టామని స్పష్టం చేశారు.

ఇక యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున చిన్నారులు నిరాశ్రయులుగా మారారని యూనిసెఫ్ తెలిపింది. 3.2 మిలియన్ల మంది చిన్నారులు తమ ఇళ్లలో ఉండిపోయారని అంచనా వేసింది. వీరిలో దాదాపు సగం మందికి తగినంత ఆహారం లేదని తెలిపింది. ఉక్రెయిన్ లోని 7.5 మిలియన్ల పిల్లలలో మూడింట రెండు వంతుల మంది ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వెళ్లారని.. 2.8 మిలియన్లు దేశంలో అంతర్గతంగా వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నారని.. ఉక్రెయిన్ వెలుపల మరో రెండు మిలియన్ల మంది శరణార్థులుగా ఉన్నారని.. మొత్తం 4.8 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులుగా ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది.

ఉక్రెయిన్ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా చేస్తున్న ఘోరాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అక్కడ పట్టు సాధించలేకపోతున్న రష్యా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కనిపించిన ప్రజలను చంపుతున్నారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఆ దేశం మీద రష్యా విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ నియమాలను రష్యా ఉల్లంఘించిందని ఇప్పటికే ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో రష్యా సైనికుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.

యుద్ధాన్ని ముగించలేకపోతున్న రష్యా సైనికులు తమ ప్రతాపాన్ని ఉక్రెయిన్ ప్రజలపై చూపుతున్నారు. ఉక్రెయిన్ లోని మైనర్ అమ్మాయిల మీద, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల మర్మాంగం, వారి శరీరంలోని సున్నితమైన భాగాల్లో కాల్చిన ఇనుప కడ్డీలతో గుర్తులు పెడుతున్నారని ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేసింది.

ఈ క్రమంలోనే అత్యాచారం, హత్యకు గురైన ఉక్రెయిన్ మైనర్ అమ్మాయిలు, మహిళల మర్మాంగాలు, సున్నితమైన ప్రాంతాల్లో ఒకే రకం అయిన కాల్చిన గుర్తులు ఉన్నాయని.. ఇది ఖచ్చితంగా రష్యా సైనికుల అరాచకాలు అని ఉక్రెయిన్ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రష్యా ప్రభుత్వం కాని.. రష్యా సైనికులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.