Begin typing your search above and press return to search.

చేతగాకపోతే దిగిపో జగన్...అచ్చెన్న ఫైర్

By:  Tupaki Desk   |   31 March 2022 11:30 AM GMT
చేతగాకపోతే దిగిపో జగన్...అచ్చెన్న ఫైర్
X
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత ఆరు సార్లు విద్యుత్ చార్జీల పెంపుతో జనం నడ్డి విరిచారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనమని, జగన్ పాలనలో జనానికి స్విచ్ వేయకుండానే షాక్ కొడుతోందని విమర్శించారు.

ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్ దేనని అచ్చెన్న ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, తాజా పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని విమర్శించారు.

తన చేతగానితనంతో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్, ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అచ్చెన్న ఫైర్ అయ్యారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలని, పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోకూడదని విమర్శించారు.

కాగా, విద్యుత్ చార్జీల పెంపు నేపథ్యంలో జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా జగన్ విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటూ పోతానని హామీలు గుప్పించారని, కానీ, ఇప్పుడు పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు.

చెత్తపన్నులతో మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్...నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు ప్రతీది పెంచుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు.

టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, కేటగిరీలు మార్చి జనాన్ని దోచుకున్న జగన్ ఏకంగా పేద, దిగువ మధ్యతరగతి వారిపై 45 శాతం విద్యుత్ చార్జీల భారం మోపారని మండిపడ్డారు. సంక్షేమం ఇస్తున్నాం కదా అని వారిపై మోయలేని భారం మోపడం సరికాదన్నారు. పేదలు, మధ్య తరగతిపై విద్యుత్ చార్జీలు పెంచి ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేశారు.