Begin typing your search above and press return to search.

కొత్త కేబినెట్ కూర్పు వేళ శనివారమంతా సీఎం ఏం చేశారు?

By:  Tupaki Desk   |   10 April 2022 5:56 AM GMT
కొత్త కేబినెట్ కూర్పు వేళ శనివారమంతా సీఎం ఏం చేశారు?
X
కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఆ మాటకు వస్తే.. మంత్రులు తమ ప్రమాణ స్వీకారం వేళలోనే వారి పదవి ఐదేళ్లు ఉండదని.. అర్థభాగమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత క్లారిటీతో ఉన్న ముఖ్యమంత్రి జగన్.. తీరా కొత్త జట్టును సిద్ధం చేసే విషయంలో కిందా మీదా పడే పరిస్థితి ఎందుకు ఉంది? అన్నది అసలు ప్రశ్న. ఎప్పుడైనా థియరీకి ప్రాక్టికల్ కు మధ్య తేడా చాలానే ఉంటుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా చేయలేని పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది.

ఊరించే మంత్రి పదవులు పోతున్న వేళ.. ఎవరు మాత్రం ఊరికే ఉండరు కదా? ఎవరికి వారు విధేయతలో తమకు మించినోళ్లు లేరని భావిస్తుంటారు. అలాంటి వారు తమ కమిట్ మెంట్ ను పట్టించుకోని వేళలో ఊరికే ఉండలేరు కదా? వారు చేసే పనులు కూడా సీఎం జగన్ మీద ప్రభావం చూపుతాయన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. కొత్త టీంలో పాత వారిని ఎంతమందిని ఉండాలి. మరెంత మందిని తీసేయాలన్నది ఎంతకూ తెగని లెక్కగా మారిందంటున్నారు.

ఐదారుగురు అని కొందరు చెబుతుంటే.. అదేమీ కాదని.. కనీసం 50శాతం వరకు పాత వారు ఉంటారన్న వాదనను వినిపిస్తున్నారు. అదే నిజమైతే.. యాబై శాతం మందిని మార్చటం కోసం ఇంత ప్రయాస అవసరమా? అన్నది ప్రశ్న. ఇంతా చేస్తే వచ్చే లాభం ఎంతన్నది పెద్ద ప్రశ్న. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో ప్రభుత్వానికి మంచిపేరు ఎంత వస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. ఎవరి పదవులు తీస్తారు? ఎవరి పదవులు ఉంచుతారు? కొత్త టీంలోకి తీసుకునే విషయంలో జగన్ అనుసరించే విధానంపై బోలెడన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మొదట్లో జగన్ అనుకున్నది వేరని.. ఇప్పుడు జరుగుతుందన్నది వేరు అని చెబుతున్నారు. కొత్త టీం ఏర్పాటు విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని జగన్ భావించినా.. పైకి కనిపించని.. బయటకు రాని ఒత్తిళ్లు ఆయనపై భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే ఆయన్ను ఒక అడుగు ముందుకు వేసి.. రెండు అడుగులు వెనక్కి వేసేలా చేయటంతోపాటు.. మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయటానికి రెండు రోజుల ముందు గంటల కొద్దీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

శనివారం మొత్తంలో ఎక్కువ సేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పేర్లను ఫైనల్ చేసే అంశం మీద అంత ఎక్సర్ సైజ్ చేయాల్సిన అవసరాన్ని చూస్తే.. సీఎం జగన్ మీద ఎంత ఒత్తిడి ఉందన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. మరి.. ఇలాంటి వేళ తీసుకునే నిర్ణయం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది కొత్త సందేహంగా చెప్పక తప్పదు. ఓవైపు కులాల లెక్కలు.. మరోవైపు రీప్లేస్ మెంట్.. మరోవైపు పాత కేబినెట్ లోని కొందరిని కంటిన్యూ చేయటం.. అలా చేయటం వల్ల కొత్తగా తలెత్తే సమస్యలు ఒక ఎత్తు అయితే.. గడిచిన మూడు నాలుగు రోజుల్లో బయటకు వచ్చిన కొత్త అంశాలు జగన్ కు ఒక పట్టాన తేల్చుకోలేని పరిస్థితిని కల్పిస్తున్నారని చెప్పక తప్పదు.