Begin typing your search above and press return to search.

కార్య‌క‌ర్త‌లూ.. వాళ్ల‌దేముంది.. స‌ర్దుకుంటారు.. న‌ష్టం మీకుటుంబాల‌కే

By:  Tupaki Desk   |   11 April 2022 7:20 AM GMT
కార్య‌క‌ర్త‌లూ.. వాళ్ల‌దేముంది.. స‌ర్దుకుంటారు.. న‌ష్టం మీకుటుంబాల‌కే
X
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌రిగింది. ఈ క్ర‌మంలో పాత మంత్రుల‌ను మారుస్తూ.. కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించారు. అయితే.. పాత‌వారిలో కొంద‌రిని ఉంచి.. మ‌రికొంద‌రిని తొల‌గించ‌డం.. తీవ్ర అసంతృప్తుల‌కు దారితీసింది. కొన్ని చోట్ల ర‌గ‌డ‌ల‌కు కూడా కార‌ణమైంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస‌రెడ్డిని తొల‌గించ‌డం.. ఆశించిన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి అవ‌కాశం చిక్క‌క పోవ‌డం, ఇక‌, ఎస్సీ కోటాలో ఉన్న మంత్రుల్లో అంద‌రినీ కొన‌సాగించి మేక‌తోటి సుచ‌రిత‌ను ప‌క్క‌న పెట్ట‌డం వంటివి తీవ్ర వివాదానికి, వివాదాల‌కు దారితీసింది.

ఆ పార్టీలో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. మంత్రి పదవులు లభిస్తాయని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలు అవి దక్కకపోవటంతో బాహాటంగానే అధిష్ఠానం పట్ల ఆగ్రహం, అసంతృప్తి, అసహనం, ఆవేదన, ధిక్కారం, నిరసన వ్యక్తం చేశారు. కొత్త మంత్రివర్గంలోనూ తమను కొనసాగిస్తారని భావించిన తాజా మాజీమంత్రులు కొందరికి ఆ అవకాశం లభించకపోవటంతో వారిలో పలువురు అధిష్ఠానంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

రాస్తారోకోలు, ద్విచక్రవాహనాల దహనాలు, ఆత్మహత్యయత్నాలు, పదవులకు రాజీనామాలతో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పలుచోట్ల ‘సీఎం డౌన్‌ డౌన్‌’ నినాదాలతో హోరెత్తించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సమ్మతం కాదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్లూ పార్టీపట్ల అసంతృప్తి ఉన్నా, మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో తమకు అవకాశం లభిస్తుందని ఆశతో ఉన్నవారంతా.. ఇక తమకు ఆ ఛాన్సు లేదని తేలిపోవటంతో తమలో రగిలిపోతున్న అసంతృప్తి జ్వాలల్ని ఒక్కసారిగా బయటపెట్టారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఒంగోలులో సీఎం జగన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. మంగమూరు రోడ్డు కూడలిలో ఆందోళన నిర్వహించారు. సుచరిత అనుచరులు గుంటూరు లాడ్జి సెంటర్‌ వద్ద ధర్నా చేపట్టారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. పిన్నెల్లి అనుచరులు రాస్తారోకోలు చేశారు. టైర్లు, ద్విచక్ర వాహనాలను దహనం చేసి నిరసన తెలిపారు. రెంటచింతల-5 ఎంపీటీసీ సభ్యురాలు పాముల సంపూర్ణమ్మ ఆత్మహత్యకు యత్నించగా.. అక్కడున్నవారు ఆమెను అడ్డుకున్నారు.

అయితే.. ఇదంతా వారు త‌మ నాయ‌కుల కోసం.. చేసినా.. అంతిమంగా జ‌రిగేది నాయ‌కులు బాగానే ఉంటారు. ఈ రోజుకాక‌పోతే..రేపు వారు స‌ర్దుకుంటారు. అధిష్టానంవారికి మంత్రి ప‌ద‌వులు కాక‌పోతే.. మ‌రో ప‌ద‌వులు ఇచ్చ‌యినా.. దారిలోకి తెచ్చుకుంటుంది. కానీ, ఈ రోజు ఆత్మాహుతి చేసుకుంటే.. న‌ష్ట‌పోయేది ఎవ‌రు? కార్య‌క‌ర్త‌ల కుటుంబాలే అలో ల‌క్ష్మ‌ణా అని జీవితాంతం అనాధ‌లుగా మారి ఏడ‌వాలి.ఈ నాయ‌కులు ప‌ట్టించుకుంటార‌నే ఆశ కూడా లేదు. మ‌హా ఇస్తే.. ఓ ప‌దివేలు.. ఇచ్చి.. క‌న్నీళ్లు తుడుస్తారు. త‌ర్వాత‌.. వారి ప‌ద‌వులు.. వారి రాజ‌కీయాలు వారు చేసుకుంటారు. కాబ‌ట్టి.. ఆవేశం కాదు.. కార్య‌క‌ర్త‌లే అయినా..ఆలోచ‌న‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని.. ప‌రిశీల‌కులు.