Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డికి బీజేపీ లైన్ క్లియ‌ర్ చేసిందా?

By:  Tupaki Desk   |   5 April 2022 5:27 AM GMT
కోమ‌టిరెడ్డికి బీజేపీ లైన్ క్లియ‌ర్ చేసిందా?
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆ పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌య్యారా? ఆయ‌న బీజేపీలో చేరేందుకు లైన్ క్లియ‌ర్ అయిందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీతో స‌మావేశంలో కోమ‌టిరెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన ఆయ‌న‌.. స‌మావేశం మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని అందుకే రాహుల్ గాంధీ ముందు కూడా త‌గ్గేదేలే అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తించార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

అప్పుడే సీన్ రివ‌ర్స్‌..

దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ఉమ్మ‌డి ఏపీలో కోమ‌టి రెడ్డి సోద‌రులు ఓ వెలుగు వెలిగారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాపై ఈ అన్న‌ద‌మ్ముల‌కు గొప్ప ప‌ట్టుంది. ప్ర‌స్తుతం త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా, అన్న వెంక‌ట్‌రెడ్డి భువ‌న‌గిరి ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డ త‌ర్వాత కూడా కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం ప‌ని చేశారు. కానీ వెంక‌ట్‌రెడ్డి టీసీపీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ‌డంతో సీన్ రివ‌ర్స్ అయింది. అప్ప‌టి నుంచి అధిష్ఠానంపై రేవంత్‌పై ఈ సోద‌రులు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మారే సంకేతాలు కూడా ఇస్తున్నారు. కేసీఆర్ఫై పోరాటం చేసే పార్టీలోకి వెళ్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక వెంక‌ట్‌రెడ్డి కూడా ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌ధాని మోడీని క‌లిశారు. ఈ ప‌రిణామాల దృష్ట్యా అన్న‌ద‌మ్ములు కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయంగా క‌నిపించింది.

క‌లిసిన‌ట్లే క‌నిపించి..

అయితే ఇక బీజేపీలోకి వెళ్ల‌డ‌మే త‌రువాయి అనే నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డితో క‌లిసి విలేక‌ర్ల స‌మావేశంలో వెంక‌ట్‌రెడ్డి క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేసీఆర్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన వెంక‌ట్‌రెడ్డి.. రేవంత్‌తో క‌లిసి ప‌ని చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలోనైనా విభేదాలు ఉంటాయ‌ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు క‌నిపించారు. కానీ మ‌ళ్లీ ఇంత‌లోనే ఇప్పుడు రాహుల్ గాంధీతో స‌మావేశంలో త‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలిపై రాహుల్ ముందు ఆయ‌న త‌న అసంతృప్తి బ‌య‌ట‌పెట్టారు. రేవంత్ ఎవ‌రిని సంప్ర‌దించ‌కుండా ఉమ్మ‌డి జిల్లాలో రెండు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డాన్ని రాహుల్ దృష్టికి వెంక‌ట్‌రెడ్డి తీసుకెళ్లారు.

ఇలా ప్ర‌క‌టించ‌డానికి కాంగ్రెస్ అధిష్ఠానం అనుమ‌తినిచ్చిందా? అని ప్ర‌శ్నించారు. క‌రీంన‌గర్ జిల్లాలో సీనియ‌ర్ నేత‌లైన జీవ‌న్‌రెడ్డి, శ్రీధ‌ర్ బాబుతో చ‌ర్చించ‌కుండా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ఏమిట‌ని? అడిగారు. దీంతో సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న త‌మ‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని కోరారు. అనంత‌రం వ‌ర్సిటీలో తెలుగు విద్యార్థుల‌తో స‌మావేశం ఉంద‌ని మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. దీంతో బీజేపీలోకి వెళ్లే లైన్ క్లియ‌ర్ అయింది కాబ‌ట్టే రాహుల్ ముందే పీసీసీపై వెంకట్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేశార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌గోపాల్‌రెడ్డి శైలి అనుమాన‌స్ప‌దంగా మారింది. ఇప్పుడు అన్న కూడా అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ సోద‌రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.