Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు పెంచిన విద్యుత్ చార్జీలతో మీ మీద పడే భారం ఎంత?

By:  Tupaki Desk   |   24 March 2022 4:30 AM GMT
కేసీఆర్ సర్కారు పెంచిన విద్యుత్ చార్జీలతో మీ మీద పడే భారం ఎంత?
X
భారం భారమే. అది ఐదేళ్లు కానీ.. పదేళ్లు కానీ. అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయాలు పెరగని వేళ.. ఏ చిన్న పెంపు కూడా సామాన్య.. మధ్యతరగతి వారికి ఇబ్బందికరంగా మారుతుంటుంది. ఐదేళ్లుగా ఛార్జీలు పెంచటం లేదని ఘనంగా చెప్పుకోవచ్చు. కానీ.. ఐదేళ్లలో సగటు జీవి బతుకు చిత్రం కూడా మారలేదన్నది వాస్తవం. పేదోడు పేదోడుగానే ఉండిపోతున్నారు. మధ్యతరగతి జీవి బతుకు చిత్రం కూడా మారని పరిస్థితి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిన నేపథ్యంలో అందరి మదిలో మెదిలే ప్రశ్న.. మా ఇంటి మీద పడే భారం ఎంత? అన్నది. దీనికి సంబంధించి.. తాజాగా పెంచిన విద్యుత్ యూనిట్ ఛార్జీలను పరిగణలోకి తీసుకుంటే.. మీ మీద పడే భారం ఎంతన్నది ఇట్టే తెలుస్తుంది. నెలకు 50 యూనిట్ల నుంచి 400 యూనిట్లు
వాడే వినియోగదారుల మీద పడే కొత్త భారం ఎంతన్నది చూస్తే.. 50 యూనిట్లు

మీరు నెలకు 50 యూనిట్లను మాత్రమే వాడితే.. ఎలాంటి ఛార్జీల పెంపు లేదని చెప్పినప్పటికీ.. లోతుల్లోకి వెళ్లి చూస్తే.. తేడా మాత్రం దాదాపు యాభై రూపాయల వరకు ఉండనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఛార్జీల ప్రకారం చూసినప్పుడు భారం లెక్క ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఉన్న ఛార్జీల ప్రకారం నెలకు 50 యూనిట్లను వినియోగిస్తే..రూ.97.50 చెల్లించాల్సి వచ్చేది. అదే కొత్త ఛార్జీల ప్రకారం రూ.147.50 చొప్పున బిల్లు పెరగనుంది.

100 యూనిట్లు వాడితే నిజానికి నెలలో 50 యూనిట్ల కంటే కూడా 100 యూనిట్లు వాడే సామాన్యులు చాలామంది ఉంటారు. ఇలాంటి వారి మీద ఏకంగా రూ.100 భారం కొత్తగా పడనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఛార్జీల ప్రకారం చూస్తే.. 100 యూనిట్లు వాడే ఇంటి వినియోగదారుడి బిల్లు రూ.202.50 వస్తే.. కొత్తగా అమల్లోకి రానున్న దాని ప్రకారం చూస్తే ఈ బిల్లు రూ.332.50 కానుంది.

200 యూనిట్లు వాడితే.. చాలామంది మధ్యతరగతి వారు దీని పరిధిలోకి వస్తారు. ఇలాంటి వారి మీద భారం కాస్త ఎక్కువగానే వేశారు. 50 యూనిట్ల వినియోగదారులకు రూ.50 చొప్పున పెరిగితే.. 200 యూనిట్లు వాడే వారి మీద రూ.110 భారం పెరగనుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న ఛార్జీల విధానం ప్రకారం 200 యూనిట్లను నెలకు వాడితే ఇప్పుడు వస్తున్న బిల్లు రూ.810. ఇది కాస్తా ఇకపై రూ.920 కానుంది.

300 యూనిట్లను వాడితే.. మధ్య తరగతి.. ఎగువ మధ్యతరగతి వారు దీని పరిధిలోకి ఎక్కువ వస్తారు. నెలలో 300 యూనిట్లు అంటే రోజుకు పది యూనిట్ల వినియోగంగా చెప్పాలి. ఇలాంటి వారు ఇప్పటివరకు వచ్చిన బిల్లు రూ.1780 అయితే.. మారిన కొత్త బిల్లు ప్రకారం రూ.1900 కానుంది. అంటే.. నెలకు రూ.120 అదనపు భారంగా చెప్పాలి.

400 యూనిట్లు వాడితే.. నిజానికి ఈ విభాగంలోని వారి మీద భారం కాస్తంత ఎక్కువగానే మోపచ్చు. కారణంగా.. నెలకు 400 యూనిట్లు అంటే.. రోజుకు 13 యూనిట్ల వరకు ఉంటుంది. ఇలాంటి వారికి ఇప్పటివరకు రూ.2650 బిల్లు వస్తే.. ఇకపై పెంచిన చార్జీల ప్రకారం చూస్తే.. అది కాస్తా రూ.2820 కానుంది. అంటే నెల బిల్లు రూ.170కు పెరగనుంది.

వాణిజ్య కనెక్షన్ల విషయానికి వస్తే అది ఇది కాకుండా.. సింఫుల్ లెక్క చెప్పాలంటే.. ఇప్పటివరకు ఉన్న అన్ని విభాగాల్లోనూ యూనిట్ కు రూపాయి చొప్పున పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు 0-100 యూనిట్ల వరకు ఇప్పటివరకు రూ.7.50 చొప్పున యూనిట్ కు వసూలు చేస్తే.. ఇప్పుడు రూ.8.50కు పెంచారు. అదే 101-300 యూనిట్లను వినియోగించే వారి మీద రూ.8.90 వసూలు చేస్తే.. దాన్ని రూ.9.90కు పెంచేశారు. 301-500 యూనిట్లను నెలకు వినియోగించే వారి మీద వసూలు చేసే రూ.9.40 యూనిట్ ధర కాస్తా రూ.10.40కు పెంచేశారు. అదే 500 యూనిట్ల వినియోగం దాటితే ఇప్పటివరకు యూనిట్ కు రూ.10 వసూలు చేసేవారు అది కాస్తా రూ.13 చొప్పున వసూలు చేయనున్నారు.