Begin typing your search above and press return to search.

ఊహాగానాల రెక్కలు కట్.. కేసీఆర్ వరుస ఢిల్లీ టూర్ లెక్క తేలింది

By:  Tupaki Desk   |   5 April 2022 6:36 AM GMT
ఊహాగానాల రెక్కలు కట్.. కేసీఆర్ వరుస ఢిల్లీ టూర్ లెక్క తేలింది
X
గతానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా విషయాన్ని రాయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. తాము రాసే రాతలకు విశ్వసనీయత ఉండాలని తపించేవారు. తమ అక్షరాలు తప్పించి.. తాము కనిపించకున్నప్పటికీ.. తమ విశ్వసనీయతను ప్రశ్నించకుండా ఉండేందుకు కిందామీదా పడేవారు. ఈ కారణంతోనే గతంలో ఏదైనా విషయం మీద ఏదైనా మీడియా సంస్థలో వార్త వచ్చిందంటే దానికి ఉండే ప్రాధాన్యత వేరుగా ఉండేది. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. బ్యాడ్ లక్ ఏమంటే.. గతంలో మాదిరి పాత్రికేయం లేదు. పోటీ ప్రపంచంలో పరుగు తీయటం.. మిగిలిన వారికి భిన్నంగా.. అప్పటికప్పుడు ఆమోదయోగ్యమైన వార్తల్ని వండేయటమే తప్పించి.. అందులోని నిజానిజాలు తెలుసుకునే కసరత్తు చాలా తక్కువగా జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. వారం వ్యవధిలో ఆయన రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. అయితే ప్రగతిభవన్ లేదంటే ఫాం హౌస్ (అదేనండి ఫార్మర్ హౌస్)కు వెళతారే తప్పించి చంద్రబాబు మాదిరి అదే పనిగా ఢిల్లీ టూర్లు పెట్టుకోరు. ఒకవేళ తెలంగాణ దాటి కాలు బయట పెట్టాలని డిసైడ్ అయితే దానికో లెక్క ఉంటుంది. ఉత్తి పుణ్యమానికి.. హడావుడి చేయటానికి.. ప్రచారం కోసం ప్రయాణాలు చేయటం కేసీఆర్ మైండ్ సెట్ కు అస్సలు సూట్ కాదు.

అలాంటి పెద్ద మనిషి.. వరుసగా రెండుసార్లు ఢిల్లీకి వెళుతున్నారంటే ఎందుకు? అన్న ప్రశ్నను వేసుకోవటం మానేసి.. మనసుకు తోచినట్లుగా అంచనాలు వేసుకోవటం ఎక్కువైంది. జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టారని.. అందులో భాగంగా మంతనాల కోసమని ఒకరు.. కేంద్రం మీద ధాన్యం కొనుగోళ్ల అంశంలో యుద్ధం చేస్తున్న వేళలో.. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు.. పలువురితో భేటీ అయ్యేందుకు అని మరికొందరు.. ఇలా ఎవరికి వారు తమ ఊహాశక్తికి తగ్గట్లు వార్తలు రాసేశారు.

ఇంతా చేస్తే.. ఆయన ఢిల్లీకి వెళ్లిన కారణం.. పంటి నొప్పి. సీఎం కేసీఆర్ చాలా విచిత్రమైన మనస్తత్వంఉన్నవారు. ఆయన ఎవరినైనా వైద్యుడ్ని నమ్మితే.. ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడికే వెళతారు తప్పించి.. వేరే వాళ్ల వద్దకు వెళ్లటానికి అస్సలు ఇష్టపడరు. ఢిల్లీలోని ఒక ప్రముఖ వైద్యుడి వద్ద ఆయన తన దంత సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఆయన మీద గురి ఎక్కువ. ఈ కారణంతోనే ఆయన ఢిల్లీకి వెళుతుంటారు. ఉన్నట్లుండి పంటి సమస్య బాగా ఇబ్బంది పెట్టటం.. దాని పరిష్కారం కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు. కొన్ని మందులు రాసిచ్చి.. వాటిని వాడిన తర్వాత సర్జరీ చేస్తామని చెప్పటంతో స్వల్ప వ్యవధిలో రెండోసారి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది.

తాజాగా ఆయనకు శస్త్రచికిత్స చేసి ఒక దంతాన్ని తొలగించారు. రోజంతా విశ్రాంతి తీసుకోవాలని చెప్పటంతో పాటు.. మరో రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచనతో ఎవరికి అందుబాటులోకి రాకుండా వెళ్లిపోయారు. కేసీఆర్ కు సర్జరీ జరిగిందన్న విషయం తెలుసుకొని ఆయన్ను పలుకరించేందుకు పలువురు ఎంపీలు ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళితే.. వారికి అందుబాటులోకి రాకుండా.. ఇంటికి వచ్చిన వారిని భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరటంతో.. భోజనం చేసి వెళ్లినట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఇలాంటి తీరు ఆయనకు మాత్రమే సొంతమని చెబుతారు. వాస్తవం ఇలా ఉంటే.. కేసీఆర్ ఢిల్లీ టూర్ మీద ఎలాంటి వార్తలు వచ్చాయో అందరికి తెలిసిందే.