Begin typing your search above and press return to search.

ఆ లెక్కలేమీ చూసుకోకుండానే మోడీపై కేసీఆర్ వార్ కు దిగారా?

By:  Tupaki Desk   |   2 April 2022 3:41 AM GMT
ఆ లెక్కలేమీ చూసుకోకుండానే మోడీపై కేసీఆర్ వార్ కు దిగారా?
X
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో జాతకాల మీద నమ్మకం.. వాస్తు మీద పట్టు.. సంఖ్యా శాస్త్రానికి పెద్ద పీట వేయటం.. మహుర్తాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లాంటివి చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కీలకమైన అంశాల విషయంలో మిగిలిన అంశాలకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో.. అంతే ప్రాధాన్యతను ఆయన జాతకం మీదా సంఖ్యా శాస్త్రానికి ఇస్తారని చెబుతారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాజకీయ యుద్ధానికి దిగిన వేళలో.. నమో జాతకాన్ని..ఆయన గ్రహ బలాల మీద అధ్యయనం చేయకుండా ఉంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

జాతక పండితుల అంచనా ప్రకారం చూస్తే.. ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగే లేదని చెబుతున్నారు. ఆయన జాతకం ప్రకారం.. గ్రహాలు.. నక్షత్రాల కదలికల ఆధారంగా చూస్తే.. ఆయన్ను ఎదుర్కొనే వాడే ఉండరని.. ఎవరైనా సరే ఆయన ముందు తేలిపోవాల్సిందేనని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రహాలైన రవి.. శుక్ర.. శని.. కుజ.. చంద్ర గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు.

ఎవరైనా ఆయనకు ఎదురుగా నిలిస్తే.. సదరు ఎన్నికల్లో వ్యతిరేకంగా జట్టు కట్టిన వారు ఘోరంగా పరాజయం పాలు కావటం ఖాయమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టటం మోడీకే చెల్లుతుందని.. ముచ్చటగా మూడోసారి ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజల ఆదరణ మాత్రమే కాదు.. గ్రహాల అనుగ్రహం కూడా ఆయన వైపే ఉందంటున్నారు.

కేంద్రంలో మోడీ జయకేతనం ఖాయమని.. ఆయన్ను ఎంతలా విమర్శించినా సరే.. ఆయనకేం కాదని.. ఆయన గెలుపును ఆపటం ఎవరి తరం కాదంటున్నారు. మరి.. ఇంత స్పష్టంగా జ్యోతిష్య పండితులు చెబుతున్న వేళ.. ఇలాంటి విషయాలకు అమితమైన ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్.. ఆ మాత్రం కసరత్తు చేయకుండానే మోడీపై సమర శంఖం పూరించి ఉంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది