Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న : ఉత్కంఠత రేపుతున్న ఈనాడు కిర‌ణ్ భేటీ ?

By:  Tupaki Desk   |   1 April 2022 2:36 PM GMT
జ‌గ‌న‌న్న : ఉత్కంఠత రేపుతున్న ఈనాడు కిర‌ణ్ భేటీ ?
X
ఈనాడు అనే మూడ‌క్ష‌రాలు అంటే వైఎస్సార్ హ‌యాం నుంచి ఇప్ప‌టి దాకా ఆ కుటుంబానికి వైరం కొన‌సాగుతూనే ఉంది. మ‌ధ్య‌లో సంధి కుదిరినా కూడా అది కొద్ది కాల‌మే అని తేలిపోయింది. ప‌ద‌వీ ప్ర‌మాణంచేసిన రోజు కూడా అస‌త్య క‌థ‌నాలు రాసినా మ‌రియు ప్ర‌సారం చేసినా ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని తేల్చేశారు. అదేవిధంగా ఆ మాట‌కు అనుగుణంగానే ఇప్ప‌టికే కొన్ని న్యాయ ప‌ర‌మైన చ‌ర్య‌లు వివిధ అంశాల‌పై తీసుకున్న దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి త‌రుణాన జ‌గ‌న్ ఇలాకాలో ఓ ఆస‌క్తిదాయ‌క ప‌రిణామం చోటు చేసుకుంది..ఆ వివరం ఈ క‌థ‌నంలో..

రాజ‌కీయాల్లో ఎవ‌రు ఎలా ఉన్నా కూడా మీడియా టైకూన్లు మాత్రం త‌మ‌కు అనుగుణంగా ప‌రిణామాల‌ను వివ‌రించుకుంటూ విస్త‌రించుకుంటూ వెళ్ల‌డం మామూలే ! వాస్త‌వానికి అదేం పెద్ద త‌ప్పు కాక‌పోయినా పార్టీల‌తో ఉండే అనుబంధం, అదేవిధంగా అప్ప‌టిదాకా ఉన్న రాజ‌కీయ అవ‌స‌రం అన్న‌వి ఒక్కొక్క‌రికీ ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కోవలో శ‌త్రువులుగా ఉన్న వారు స్నేహితులు అయి ఉండడం కాల ధ‌ర్మం. ధ‌ర్మం అన‌డం క‌న్నా మ‌హిమ అని రాయాలి. కాల మ‌హిమ‌లో భాగంగానే ఇవాళ ఎన్నో మార్పులు మ‌రియు చేర్పులు పాల‌న‌కు సంబంధించి జ‌రుగుతున్నాయి.

ఓ విధంగా చెప్పాలంటే వీరు వీర‌యినా వీరు వార‌యినా ఉన్న‌తి అనుకున్న‌ది ప‌త‌నం అయినా, ప‌తనం అనుకున్న‌ది ఉన్న‌త స్థానం అందుకున్నా ఇవ‌న్నీ పార్ట్ ఆఫ్ గేమ్ అని అనుకుని స‌ర్దుకుపోవ‌డంలో త‌ప్పేం లేదు. ఎప్పుడూ మీడియాతో ముఖ్యంగా ఈనాడు సంబంధిత గ్రూపు సంస్థ‌ల మీడియాతో పొడ గిట్ట‌ని విధంగా ఉంటారు జ‌గ‌న్. అలాంటిది ఇవాళ ఆయ‌న‌తో ఈనాడు కిరణ్ భేటీ అయ్యారు. ఓ విధంగా రాష్ట్ర స‌చివాలయంలో ఇదొక స‌ర్ ప్రైజింగ్ పాయింట్. త‌న కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు వ‌చ్చారు.

గ‌తంలోనూ త‌న పెద్ద కుమార్తె వివాహానికి జ‌గ‌న్ ను ఆహ్వానించిన దాఖలాలు ఉన్నాయి. వేడుక‌లకు ఆహ్వానించ‌డం,ఆ రోజు జ‌గ‌న్ వెళ్లి రామోజీ తో మాట్లాడి రావ‌డం అన్న‌వి మీడియాలో చాలా బాగా హైలెట్ అయ్యాయి. అప్ప‌టికీ ఇంకా జ‌గ‌న్ సీఎం కాదు. విప‌క్ష నేత హోదాలో ఉన్నారు. జ‌గ‌న్ అనే విప‌క్ష నేత  చంద్ర‌బాబుతో హోరాహోరీగా పోరాడుతున్నారు. అలాంటి స‌మ‌యంలో రామోజీ రావు ద‌గ్గ‌ర‌కు వెళ్లి చాలా సేపు ఆత్మీయంగా మాట్లాడి పెద్దాయ‌న యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని వ‌చ్చారు. ఇప్పుడు కూడా గ‌త కొద్ది రోజులుగా ఈనాడు గ్రూపు సంస్థ‌లంటే కోపం అవుతున్నారు జ‌గ‌న్.

మ‌న‌కు చంద్ర‌బాబు అంటే న‌థింగ్ కానీ ఈనాడు తో స‌హా అదే భావ‌జాలంతో ప‌నిచేస్తున్న ఆంధ్ర‌జ్యోతి,టీవీ5  వీటితోనే మ‌నం పోరాడాలి. ఇవి ఉన్మాద రీతిలో ప‌నిచేస్తున్నాయి..అని కూడా సంచ‌న‌లనాత్మ‌క వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్సీపీ శాస‌న స‌భా ప‌క్ష పార్టీ స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు ఎంతో సంచ‌ల‌నం అయ్యాయి. మ‌రో సంద‌ర్బంలో తానేమీ  రామోజీరావును కాన‌ని, త‌న‌కు ఈనాడు పేప‌ర్ లేద‌ని కూడా వ్యాఖ్యానించి, శాస‌న స‌భ‌లో త‌నపై ఈనాడు గ్రూపు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని మ‌రోమారు వెలుగులోకి తెచ్చి సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నించారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా వివాహ వేడుక‌లకు సీఎం వెళ్తారా ?