Begin typing your search above and press return to search.

ఇగోను పక్కన పెట్టి తెలంగాణ మనసును టచ్ చేసిన తమిళ సై

By:  Tupaki Desk   |   2 April 2022 4:10 AM GMT
ఇగోను పక్కన పెట్టి తెలంగాణ మనసును టచ్ చేసిన తమిళ సై
X
పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలే అయినా.. రెండు రాష్ట్రాల్లోని ప్రజల మైండ్ సెట్.. ఆలోచించే తీరు.. ప్రభుత్వాధినేత విషయంలో స్పందించే వైనం కాస్త భిన్నంగానే ఉంటాయని చెప్పాలి. తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అన్నింటికి మించిన వారి ప్రాధాన్యత క్రమంలో తమ ప్రాంతానికి వారు అత్యధిక ప్రయారిటీ ఇస్తారు. ఈ సందర్భంగా కులం.. మతం లాంటి వాటిని సైతం లైట్ తీసుకుంటారు. తమ ప్రాంతం గురించి వారు తరచూ ఆలోచిస్తుంటారు. ఇక.. తమ పద్దతులు.. విధానాలు.. కల్చర్ లాంటి విషయంలోనూ వారి తీరు.. ఏపీ ప్రజలకు భిన్నంగా ఉంటుంది.

ఏపీ ప్రజల మొదటి ప్రాధాన్యత కులానికి ఇస్తే.. తెలంగాణ ప్రజలు ప్రాంతానికి ఇస్తారు. ఇక.. పాలకులు చేసే ఏ తప్పునైనా భరిస్తారేమో కానీ.. అహంకారాన్ని మాత్రం అస్సలు సహించని తత్త్వం తెలంగాణలో కొట్టొచ్చినట్లు కనిపిస్తే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన తీరు కనిపిస్తుంటుంది. తమ పాలకులు ఎలాంటి వారైనా సరే.. వారిని భరిద్దామన్నట్లుగా ఏపీ ప్రజల తీరు ఉంటుంది. తమ కులానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉంటే చాలు.. ఎన్ని తప్పులు చేసినా.. వాటిని పట్టించుకోని తీరు కనిపిస్తుంది. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రజలు మాత్రం కులానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వనితత్త్వం కనిపిస్తుంది.

రాజకీయ వైరంలో కులం ఏపీలో కీలకమైతే.. తెలంగాణలో అంత ముఖ్యమైనదిగా కనిపించదు. ఇలా.. రెండు తెలుగు రాస్ట్రాల ప్రజల మైండ్ సెట్ విషయంలో చాలానే తేడాలు కనిపిస్తాయి. ఇలాంటి విషయాల మీద తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు అవగాహన ఎక్కువగానే ఉందన్న విషయం తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పగవాడైనా సరే.. ఇంటికి వస్తే అతిధ్యం ఇవ్వటం తెలుగోడికి అలవాటు. అంతేకాదు.. మాటల్లేని వారు వచ్చి తమ ఇంట్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తే.. దాన్ని మన్నించి వారింటికి వెళ్లటం అలవాటు.

అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం తమిళ సై ఆహ్వానాన్ని మన్నించలేదు. ఉగాది సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇదే విషయాన్ని తనదైన శైలిలో ప్రస్తావించిన తమిళసై.. తనకు ఇగోలేదన్న విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. తనను పిలవాలే కానీ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్ కు కూడా వెళ్లేదానినని.. ప్రోటోకాల్ ను సైతం పక్కన పెట్టేసేదానినంటూ చేసిన వ్యాఖ్య తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకోవటం ఖాయమంటున్నారు.

తన మాటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టెడు ఇగో ఉందన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారు. అదే సమయంలో తనకు అలాంటివేమీ ఉండవని తేల్చటంతో పాటు.. తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం నచ్చని అహంకారం.. అహంభావం తనలో మచ్చుకు లేవన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి. ఇదంతా చూస్తే.. తన చేతలు కేసీఆర్ కు నచ్చని వేళ.. తన మాటలతో తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుచుకునేలా ఆమె మాట్లాడారని చెప్పక తప్పదు.