Begin typing your search above and press return to search.

పెట్రోల్.. డీజిల్ తో పాటు తాజాగా గ్యాస్ ‘బండ’

By:  Tupaki Desk   |   23 March 2022 7:31 AM GMT
పెట్రోల్.. డీజిల్ తో పాటు తాజాగా గ్యాస్ ‘బండ’
X
క్యాలెండర్లో తేదీలు మారిన చందంగా పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలోనూ మార్పులు మామూలే అన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న రోజు తర్వాత ప్రతి ఇంటిని ప్రభావితం చేసే ధరల విషయంలో మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత ఇంటి అవసరాల కోసం వినియోగించే గ్యాస్ బండ ధరను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా సిలిండర్ కు రూ.50 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ బండ విషయంలో ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఎన్నికలు.. వాటి ఫలితాలు వచ్చేయటమే కాదు.. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతున్నాయి.

ఇలాంటి వేళ.. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురుకు తగ్గట్లు దేశీయంగా పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. ఇప్పుడు రాజకీయ వాతావరణం అంతా సెట్ అవుతున్న వేళ.. తొలుత పెట్రోల్.. డీజిల్ ధరల్ని లీటరకు దగ్గర దగ్గర రూపాయి చొప్పున పెంచటం తెలిసిందే. కాస్త ఆలస్యంగా ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నా.. ఆ మొత్తం కాస్త ఎక్కువగానే ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. ఇంటి అవసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధర అక్టోబరులో రూ.952 ఉంటే.. తాజాగా దాని ధర హైదరాబాద్ లో రూ.1002గా నిర్ణయించారు. గతంలోని ధరతో పోలిస్తే సిలిండర్ ఒక్కొక్క దానిపైనా రూ.50 వరకు పెరిగిపోయింది. ఇక.. కమర్షియల్ గ్యాస్ బండ ధర మాత్రం తగ్గింది. 19కేజీలు ఉండే ఈ బండ ఇప్పటివరకు రూ.2195 ఉండే.. దాన్ని రూ.2186.50 తగ్గినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్న కాలమంతా భారం మోపటమే తప్పించి.. తగ్గించే అవకాశం లేదంటున్నారు. వాణిజ్య సిలిండర్ విషయానికి వస్తే.. ఏడాది క్రితానికి ఇప్పటి ధరకు ఏ మాత్రం పోలిక లేదని.. వందల్లో రేటు పెంచేసినట్లుగా వాపోతున్నారు.