Begin typing your search above and press return to search.

జనసేన ప్లస్ ఆప్ : ఆ పార్టీలకు భారీ షాక్...?

By:  Tupaki Desk   |   13 May 2022 9:30 AM GMT
జనసేన ప్లస్ ఆప్ : ఆ పార్టీలకు భారీ  షాక్...?
X
ఏపీలో జనసేన గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. ఎందుకంటే టీడీపీ పాలనను జనాలు ఎపుడో చూసేశారు. వైసీపీని ఇపుడు చూస్తున్నారు. తాజాదనం, కొత్తదనం ఏమైనా ఉందీ అంటే అది జనసేనలోనే ఉంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. రాజకీయాల్లో నేతలకు ఉండే అవినీతి పీడ, చీడ అంటుకోని నిఖార్సైన నేతగా పవన్ ఈ రోజుకీ జనంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు.

అయినా సరే పవన్ మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన పాత పార్టీలతో రాజకీయంగా నలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్లనే అంటారు. నిజానికి తెలుగుదేశానికి జనసేన 2014లో మద్దతు ఇచ్చింది కానీ కలసి పోటీ చేయలేదు, సీట్లు తీసుకోలేదు. అయినా సరే టీడీపీ చేసిన తప్పులకు జనసేనను బాధ్యురాలిని చేస్తూ వైసీపీ రాజకీయ ఆట ఆడేసుకుంది.

అలాగే బీజేపీకి మోడీకి పవన్ మద్దతు ఇచ్చారని ఈ రోజుకీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం వంటి అంశాల గురించి ప్రస్థావిస్తూంటారు. ఇపుడు కూడా పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఒక విధంగా ఇది సంకట పరిస్థితి. ఎందుకంటే పవన్ ఎమ్మెల్యే కూడా కాలేదు, అధికారం అంటే ఏమిటో కూడా జనసేనకు తెలియదు. ఫ్రెష్ గా ఉండాల్సిన పార్టీకి మకిలి పొత్తు పార్టీల వల్లనే అన్నది ఒక నిఖార్సైన విశ్లేషణ.

ఇదిలా ఉంటే ఇపుడు జనసేనలో కూడా దీని మీద చర్చ సాగుతోంది అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు భవిష్యత్తు అన్నది శూన్యమని అంటున్నారు. అదే సమయంలో పవన్ని సీఎం చేస్తామని హామీ ఇస్తే కచ్చితంగా పొత్తు పెట్టుకున్నా ఎన్నిరకాలైన రాజకీయ విమర్శలు వచ్చిన భరించవచ్చు అని అంటున్నారు. అలా కాకపోతే టీడీపీ పల్లకీ మోసే కంటే సొంతంగా జనసేన పోటీకి దిగడం మంచిది అని కూడా సూచనలు వస్తున్నాయట.

ఏపీలో ఇప్పటికే ఎదుగుదామని ఆప్ భావిస్తోంది. ఆ పార్టీకి పొలిటికల్ గా క్లీన్ ఇమేజ్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని అనేక ఏళ్ళుగా ఏలుతున్నా కూడా అవినీతి మచ్చ అయితే అసలులేదు, దాంతో పాటు పంజాబ్ ని కైవశం చేసుకుంది. ఇంకా ఉత్తరాదిన గట్టిగానే విస్తరిస్తోంది.

ఈ నేపధ్యంలో ఏపీలో కూడా ఆప్ కాలు మోపాలని అనుకుంటోంది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితే కొత్త లుక్ ఈ కాంబోకు వస్తుంది అంటున్నారు. ఆ మీదట ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్న కామ్రేడ్స్ ని కలుపుకుని ముందుకు సాగితే జనసేనకు టర్న్ అయ్యే జనాలు పెద్ద ఎత్తున ఉంటారు అంటున్నారు.

ఏపీలో రాజకీయాలను తారుమారు చేసే ముప్పయి శాతం బలమైన సామాజిక వర్గం అండదండలు కూడా జనసేనకు లభిస్తాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే జనసేన ఈ రకమైన కాంబోతో కనుక వస్తే అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి కూడా చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు. ఒకవేళ ఒక అనుకున్న‌ సీట్లు రాకపోతే పోస్ట్ పోల్ అలయెన్స్ కి వెళ్ళినా వెళ్లవచ్చు కానీ 2024 ఎన్నికలలో పవన్ భావ సారూప్యత కలిగిన కొత్త పార్టీలతో పొత్తుకు వెళ్లాలని సూచనలు వస్తున్నాయట. మరి దీని మీద జనసేనాని ఏమంటారో చూడాలి.