Begin typing your search above and press return to search.

మూడు రోజులు ఢిల్లీలో ఏమి చేస్తారు ?

By:  Tupaki Desk   |   26 July 2022 5:34 AM GMT
మూడు రోజులు ఢిల్లీలో ఏమి చేస్తారు ?
X
ఇపుడిదే ప్రశ్న తెలంగాణా రాజకీయ పార్టీల్లో వినిపిస్తోంది. ఢిల్లీలో మూడు రోజుల పర్యటన కోసమని కేసీయార్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజులు కేసీయార్ ఢిల్లీలో ఏమిచేస్తారనే విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే ఈమధ్య కూడా నాలుగు రోజులు కేసీయార్ ఢిల్లీలో మకాం వేశారు. ఎవరిని కలిసారో తెలీదు. గెస్ట్ హౌస్ లోనే కూర్చుని ఏమి చేశారో ఎవరికీ తెలీదు. అందరికీ తెలిసిందల్లా రైతు నేత రాకేష్ తికాయత్ మాత్రం కేసీయార్ ను కలిశారు.

తికాయత్ ను మాత్రమే కలిసిన కేసీయార్ అన్నిరోజులు ఏమిచేశారంటే ఎవరికీ సమాధానం లేదు. అలాంటిది మళ్ళీ ఇపుడు మూడు రోజులు ఎందుకు క్యాంపు వేస్తున్నారనే విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు.

తెలంగాణా సీఎంను కలిసే విషయంలో కూడా జాతీయస్ధాయిలోని నేతల్లో చాలామంది పెద్దగా సానుకూలంగా లేరని సమాచారం. ఈ మధ్యనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. అలాగే ఆ మధ్య ఒకసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కూడా భేటీ అయ్యారు.

నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీయార్ కు బలమైన కోరికున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు తగ్గట్లుగా శక్తి సరిపోతున్నట్లులేదు. ఎందుకంటే జాతీయ స్ధాయిలో కేసీయార్ క్రెడిబులిటి చాలా తక్కువ. ఎప్పుడు ఎవరితో ఉంటారో, ఎప్పుడు ఎవరికి మద్దతిస్తారో ఊహించటం కష్టం. ఆ మధ్య కేంద్రంపై యుద్ధమే అంటు చాలా భీకరమైన ప్రకటన చేశారు.

అందరు నిజమే అనుకుని కేసీయార్ వైపు చూశారు. తీరా చూస్తే యుద్ధం లేదు సరికదా కనీసం యుద్ధాన్ని కూడా ప్రకటించలేదు. తర్వాత చాలాకాలం మోడీ గురించి అసలు మాటే ఎత్తలేదు. తెరవెనుక ఏమైందో ఎవరికీ తెలీదు.

మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కాన్సిస్టిట్యూషనల్ క్లబ్ లో నాన్ ఎన్డీయే పార్టీల సమావేశం జరిగితే దానికి హాజరుకాలేదు. ఇలాంటి చేష్టల కారణంగానే చాలామంది సీనియర్ నేతలు కేసీయార్ ను నమ్మటం లేదని సమాచారం. మరిపుడు మూడురోజులు ఢిల్లీలో కూర్చుని ఏమిచేస్తారో చూడాలి.