Begin typing your search above and press return to search.

జ‌గన్ 2.0 : కాళ్లు మొక్క‌డం ఎందుకు ? ఓవ‌ర్ అనిపించ‌ట్లే!

By:  Tupaki Desk   |   12 April 2022 8:30 AM GMT
జ‌గన్ 2.0 : కాళ్లు మొక్క‌డం ఎందుకు ? ఓవ‌ర్ అనిపించ‌ట్లే!
X
పనిచేస్తేనే ప‌ద‌వులు.. రాణిస్తేనే మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌ద‌వులు. ఇప్పుడున్న ప‌ద‌వి వ‌య‌స్సు రెండేళ్లు.. బాగా ప‌నిచేస్తే మ‌ళ్లీ వీళ్లే మంత్రులు..లేదంటే ఇంటికే! ఇదే మాట జ‌గ‌న్ ప‌ది సార్లు చెప్పారు.కానీ ఆయ‌న భ‌జ‌న‌కు ప్రాధాన్యం ఇస్తూ పోతున్న నేత‌లు ప్ర‌జ‌లు త‌మ‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు అన్న విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. త‌మ హోదా మ‌రిచి కాళ్ల మీద ప‌డ‌డం నిజంగానే హాశ్చ‌ర్య‌క‌రం. ఎందుకీ విన‌యం ? ఏమి ఈ గౌర‌వం? ఎందుకీ అత్యుత్సాహం లేదా అతి ఆరాటం?

గౌర‌వం, మ‌న్న‌న అన్న‌వి ఎవ‌రికి వారు పొందాలి. ఎవ‌రంత‌ట వారు ద‌క్కించుకోవాలి. రాజరికంలో లేక‌పోయినా స‌రే కొన్ని సార్లు మ‌నం హుందాగానే ఉండాలి. రాజు అక్క‌డ ఎంత‌టి వాడ‌యినా మోక‌రిల్లాల్సిన ప‌ని లేదు. ప్ర‌జాస్వామ్య దేశాల్లో వంగి వంగి దండాలు పెట్టాల్సిన ప‌ని లేదు. ఆ మాత్రం గౌర‌వం ఇస్తే చాలు. కాళ్లు మొక్కి ప‌ద‌వులు నిలుపుకోవాల్సిన ప‌నే లేదు.

ఈ విష‌యం రోజా సెల్వ‌మ‌ణికి తెలియదు అని అనుకోలేం. ఆమె క‌న్నా వ‌య‌సులో పెద్ద‌వారయిన నారాయ‌ణ స్వామి అనే డిప్యూటీ సీఎంకు తెలియ‌దు అని అనుకోలేం. భావోద్వేగాల‌ను నియంత్రించుకుని హుందాత‌నం చాటితేనే నాయ‌కులకు విలువ. ఈ విష‌యంలో బొత్స బెట‌ర్. ధ‌ర్మాన కూడా బెట‌ర్. వాళ్లెవ్వ‌రూ కాళ్ల‌పై ప‌డ‌లేదు. ఇదీ నిన్న‌టి వేళ చోటు చేసుకున్న అరుదైన ఘ‌ట‌నలు. అయినా ఓ పెద్దాయ‌న త‌న వ‌య‌స్సు మ‌రిచి కాళ్ల‌పై పడితే ఏమ‌నుకోవాలి..?

విన‌యం ప్ర‌వ‌ర్త‌న‌లో ఉంటే చాలు ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచాల్సిన ప‌ని లేదు. మంత్రులకు ఈ పాటి తెలియ‌దా? తెలియ‌కుండానే జ‌గ‌న్ కాళ్ల మీద ప‌డి స్వామి భ‌క్తి చాటుకున్నారా? అయ్యో ! వీళ్లంతా రేప‌టి వేళ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన వారు క‌దా! ఈ పాటి కూడా తెలియ‌దా వీళ్ల‌కు అని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. జ‌గ‌న్ కూడా కాళ్ల మీద ప‌డుతున్న సంద‌ర్భంలో ఆయా నాయ‌కుల‌ను వ‌ద్ద‌నే వారించారు.

వాస్త‌వానికి ఆయ‌నే కాదు ఎవ్వ‌రూ కూడా ఆ త‌ర‌హా ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించరు. వాటి వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు క‌నుక! భ‌జ‌న కార‌ణంగానే ప‌ద‌వులు వ‌స్తాయి అనుకుంటే గ‌తంలో ఇంత‌కుమించి ఎక్కువ‌గానే జ‌గ‌న్ నామ స్మ‌ర‌ణ చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారెవ్వ‌రూ న‌యా ట్రూపులో చోటు ద‌క్కించుకోలేక‌పోయారు. ముఖ్యంగా బూడి ముత్యాల నాయుడు, నారాయ‌ణ స్వామి (వ‌య‌స్సులో జ‌గ‌న్ క‌న్నా చాలా పెద్ద‌వారు. 70 దాటి ఉంటుంది), విడ‌ద‌ల ర‌జ‌నీ, రోజా, జోగి ర‌మేశ్, తానేటి వ‌నిత, సీదిరి అప్ప‌ల్రాజు, గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులంతా ఆయ‌న కాళ్ల‌పై ప‌డ్డారు.

రోజా అయితే మ‌రో అడుగు ముందుకు వేసి ముఖ్య‌మంత్రి చేతికి ప్రేమగా ముద్దు ఇచ్చి వ‌చ్చారు. అంత‌టితో ఆగ‌క పెద్దాయ‌న పెద్దిరెడ్డి కాళ్లు కూడా మొక్కారు. ఇవ‌న్నీఎందుకు అన్న ప్ర‌శ్న‌లు రేగుతున్నాయి. స‌మ‌ర్థంగా ప‌నిచేస్తే ఫ‌లితాలు వ‌స్తాయి కానీ ఇటువంటి చ‌ర్య‌ల కార‌ణంగా ప‌దవులు నిల‌బ‌డ‌తాయా? లేదా గొప్ప గుర్తింపు ఏమ‌యినా వ‌స్తుందా అన్న ప్ర‌శ్న‌లు రేగుతున్నాయి.