Begin typing your search above and press return to search.

బాప్ రే.. దేశంలో అన్ని కోట్ల కేసులు పెండింగ్ నా?

By:  Tupaki Desk   |   26 March 2022 9:20 AM GMT
బాప్ రే.. దేశంలో అన్ని కోట్ల కేసులు పెండింగ్ నా?
X
దేశంలో కేసులు త్వరగా పూర్తికాక కొందరు రిమాండ్ ఖైదీలుగానే జైళ్లలో మగ్గిపోతున్నారని ఎన్నో ఉదాహరణలు బయటకు వచ్చాయి. కొన్ని సినిమాలు వీటిపై వచ్చాయి. అయినా మన న్యాయవ్యవస్థలో జాప్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కోట్ల కేసులు పెండింగ్ లో ఉండడం షాకింగ్ గా మారింది.

దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 4 కోట్ల 70 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 2 వరకూ ఒక్క సుప్రీంకోర్టులోనే 70154 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వివరించింది. మార్చి 21 నాటికి 25 హైకోర్టుల్లో 58 లక్షల 94 వేల 60 పెండింగ్ కేసులు ఉన్నట్టు లోక్ సభకు తెలిపింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రన్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ గణాంకాలను వెల్లడించారు.

వివిద జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో కలిపి 4 కోట్ల 10 లక్షల 47 వేల 976 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన గణాంకాలు నేషనల్ జ్యూడీషియల్ డేటా గ్రిడ్ లో అందుబాటులో లేవన్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 4 కోట్ల 70 లక్షల 12 వేల 190 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని.. ఆయా కోర్టుల్లో పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి నిర్ధేశించలేదన్నారు. కేసుల పరిష్కారంలో అనేక అడ్డంకులున్నాయన్నారు.

న్యాయమూర్తుల ఖాళీలు, తరచూ కేసులు వాయిదా పడడంతోపాటు విచారణలో.. ట్రాక్ చేయడానికి తగిన ఏర్పాట్లు లేవని గమనించినట్టు తెలిపారు.