Begin typing your search above and press return to search.

న్యాయ రాజధానికి స్థలం ఎంపికయ్యిందా ?

By:  Tupaki Desk   |   2 April 2022 9:26 AM GMT
న్యాయ రాజధానికి స్థలం ఎంపికయ్యిందా ?
X
ఒకవైపు అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు స్పష్టంగా తీర్పుచెప్పింది. ఇదే సమయంలో మూడు రాజధానులే తమ విధానమని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆచరణ సాధ్యం కాదని జగన్ తేల్చి చెప్పేశారు. గతంలో తాము ప్రకటించినట్లుగా మూడు రాజధానుల ఏర్పాటుకే తమ ప్రభుత్వం కట్టుబడుందని చెప్పారు. అయితే జగన్ చేసిన ప్రకటన ఎప్పటికి ఆచరణలోకి వస్తుందో అనే విషయంలో అయోమయం ఉంది.

ఈ నేపధ్యంలోనే ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె వద్ద నిర్మించబోతున్న జలాశయానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నీ అనుమతులు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాలను నగర శివార్లలోని జగన్నాధగుట్టపై నిర్మించాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. రాయలసీమపై ఉన్న మమకారంతోనే న్యాయ రాజధానిని కర్నూలుకు జగన్ ప్రకటించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఏర్పాటవునున్న రెండో జాతీయ న్యాయ కళాశాలను కూడా కర్నూలులోనే నిర్మించనున్నట్లు చెప్పారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలను రు. 100 కోట్లతో డెవలప్ చేయబోతున్నట్లు కూడా బుగ్గన చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కర్నూలుకు న్యాయ రాజధాని అని మంత్రి బుగ్గన అరిగిపోయిన రికార్డులాగ పాతపాట పాడి ఊరుకోలేదు. న్యాయ రాజధాని కోసం నిర్మించాల్సిన భవనాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నామో కూడా చెప్పారు.

కర్నూలు శివార్లలో జగన్నాథ గుట్టపై న్యాయ రాజధానికి అవసరమైన భవనాలను నిర్మించాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. అంటే కర్నూలుకు న్యాయ రాజధాని తరలింపుపై ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుత పరిస్ధితులను చూస్తుంటే మూడు రాజధానుల ఏర్పాటన్న జగన్ కల ఎప్పటికి నెరవేరుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.

క్షేత్రస్థాయి పరిస్ధితులైతే మూడు రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికైతే అనుకూలంగా లేదన్నది వాస్తవం. మరి న్యాయ రాజధాని కోసం భవనాలను నిర్మించేందుకు స్ధలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారంటే బుగ్గన ధైర్యం ఏమిటో వెయిట్ చేసి చూడాల్సిందే.