Begin typing your search above and press return to search.

పంజాబ్ సీఎం.. మ‌రో స్టాలిన్ అవుతారా?

By:  Tupaki Desk   |   26 March 2022 6:25 AM GMT
పంజాబ్ సీఎం.. మ‌రో స్టాలిన్ అవుతారా?
X
రాజ‌కీయాల్లోకి కొత్త ర‌క్తం రావాలి. మూస ధోర‌ణుల‌కు వీడ్కోలు ప‌లికి సంస్క‌ర‌ణాత్మ‌కంగా పాల‌న కొన‌సాగించే యువ నాయ‌కుల అవ‌స‌రం దేశానికి ఉంది. అందుకే అవ‌కాశం వ‌చ్చిన వెంట‌నే యువ నాయ‌కులు ముఖ్య‌మంత్రులుగా త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ఇప్ప‌టికే వివిధ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో, సంస్క‌ర‌ణ‌ల‌తో త‌మిళానాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అత్యుత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఈ డీఎంకే నేత మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఇప్పుడు స్టాలిన్ బాట‌లోనే మ‌రో ముఖ్య‌మంత్రి సాగేలా క‌నిపిస్తున్నారు. ఆయ‌నే.. పంజాబ్ నూత‌న సీఎం భ‌గ‌వంత్ మాన్‌. తొలిసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసిన వెంట‌నే ఈ ఆప్ సీఎం సంస్క‌ర‌ణ‌ల‌కు తెర‌తీశారు.

అంద‌రితో క‌లిసి..

ఏ పార్టీనైనా కొత్త‌గా అధికారంలోకి వ‌స్తే.. గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వాళ్ల ప్రారంభించిన ప‌నుల‌ను మ‌ధ్య‌లోనే ఆపేయ‌డం సాధార‌ణంగా జ‌రుగుతుంది. కానీ స్టాలిన్ మాత్రం అన్నాడీఎంకే ప్ర‌భుత్వంలో తీసుకువ‌చ్చిన మంచి ప‌నులు, ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను కూడా భాగ‌స్వాములుగా చేస్తూ సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆదాయాన్ని వృథా చేయ‌కుండా.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌థ‌కాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా ఇదే వైఖ‌రి అనుస‌రిస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేల పింఛ‌ను విష‌యంలో ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు.

తొలి రోజు నుంచే..

పంజాబ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాతి రోజే భ‌గ‌వంత్ మాన్ అవినీతిని అరిక‌ట్టేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ అధికారులు, ప్రజా ప్ర‌తినిధులు ఎవ‌రైనా లంచం అడిగితే దాన్ని వీడియో తీసి వాట్సాప్ ద్వారా త‌న‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక గ‌తేడాది అక్టోబ‌ర్‌లో దెబ్బ తిన్న పంట‌ల‌కు తాజాగా భ‌గ‌వంత్ మాన్ పంట న‌ష్టం ప‌రిహారాన్ని విడుద‌ల చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగింది క‌దా అని ఇత‌ర నాయ‌కుల్లాగా ఆయ‌న వ‌దిలేయ‌లేద‌ని.. రైతులు మేలు కోసం ఆలోచించార‌ని నిపుణులు చెబుతున్నారు. త‌న మొద‌టి ఉత్త‌ర్వుల్లోనే 35 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు. మ‌రోవైపు త‌న కేబినేట్‌లోని మంత్రుల‌కు కొన్ని టార్గెట్‌లు విధిస్తాన‌ని అవి చేరుకోలేని నాయ‌కుల‌పై వేటు వేస్తాన‌ని ఆయ‌న హెచ్చరిస్తున్నారు.

ఎన్నిసార్లు గెలిచినా..

ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యేల‌కు ఇచ్చే పింఛ‌ను విష‌యంలో భ‌గ‌వంత్ మాన్ ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా ప‌నిచేసినా ఒకే ఒక్క ప‌ద‌వీ కాలానికి సంబంధించిన పింఛ‌ను మాత్ర‌మే ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. పంజాబ్‌లో ప్ర‌స్తుతం ఒక్క‌సారి ఎమ్మెల్యేకు ప‌ని చేసిన వాళ్ల‌కు ప‌ద‌వీ కాలం పూర్త‌యిన త‌ర్వాత ప్ర‌తి నెల రూ.75 వేల చొప్పున పింఛ‌ను చెల్లిస్తున్నారు. త‌రువాత మ‌ళ్లీ ఎమ్మెల్యేగా చేస్తే.. ప్ర‌తి ప‌ద‌వీ కాలానికి ఈ పింఛ‌ను మొత్తం 66 శాతాన్ని అద‌నంగా ఇస్తున్నారు. ఇలా మూడున్న‌ర ల‌క్ష‌ల నుంచి అయిదున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు నెల‌కు పింఛ‌ను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్నార‌ని మాన్ చెప్పారు. ప్ర‌జాసేవ చేసే అవ‌కాశం ఇవ్వ‌లంటూ చేతులు జోడించి ఓట్లు అభ్య‌ర్థించే నేత‌లు.. ఇలా భారీ మొత్తంలో పింఛ‌న్లు పొంద‌డం స‌రికాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కోత విధించిన పింఛ‌న్ల‌ను సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం ఉపయోగిస్తామ‌ని తెలిపారు. దీంతో ఆయ‌న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.