Begin typing your search above and press return to search.

నిద్ర కోసం కిందామీదా కొట్టుకుంటున్నారట.. తాజా సర్వే చెప్పిందిదే

By:  Tupaki Desk   |   20 March 2022 12:30 AM GMT
నిద్ర కోసం కిందామీదా కొట్టుకుంటున్నారట.. తాజా సర్వే చెప్పిందిదే
X
పొద్దున లేచింది మొదలు ఏదో ఒక పనితో బిజీ బిజీగా ఉంటూ.. అలసిన శరీరాన్ని.. కంటికి సరిపడా విశ్రాంతిని ఇచ్చేది నిద్ర. కానీ.. దాని జాడ దొరక్క ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదన్న మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంటుంది. ఆ మాటకు వస్తే నిద్రతో చాలానే ఆరోగ్య సమస్యలు తీరతాయి. అదే సమయంలో కంటి నిండా నిద్ర లేనితనంతో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు.

పరుగులు తీసే ప్రపంచంలో నిద్ర లేని తనం పెద్ద సమస్యగా మారింది. దీనికి సంబంధించి తాజాగా ఏఐజీ ఆస్పత్రి వారు ఒక సర్వేను నిర్వహించారు. ఇందులో ఆసక్తికర అంశాలు చాలానే బయటకు వచ్చాయి. నిద్ర క్రమం తప్పితే శరీరం అదుపు తప్పుతుందని.. ఇంద్రియాలు నియంత్రణ కోల్పోతాయని.. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.
గాడ్జెట్స్‌ వినియోగంతో చాలా మంది నిద్రపోవడం లేదని, ప్రతి పది నిమిషాలకు ఒక సారి సెల్‌ఫోన్‌ చూడడం, నోటిఫికేషన్లు చదవడం, రిప్లై ఇవ్వడం వల్ల కునుకుకు దూరమవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల్లో నిద్ర రావాలని, కానీ చాలా మందికి అలా జరగడం లేదన్న విషయాన్ని గుర్తించారు. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన సర్వే లోని కీలక అంశాల్ని చూస్తే..

- పడకపైకి చేరినా.. నిద్ర పట్టక దాదాపు 60 శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. అసహనం ఎక్కువై పడక దిగేస్తున్నారు.

- 2 శాతం మంది స్లీప్‌ అప్నియా సమస్యతో భాధపడుతున్నారు. వీరికి పడుకుంటే శ్వాస సమస్యలు ఎదురవుతాయి. ఊపిరి అందక తీవ్రంగా ఇబ్బంది పడుతారు.

- సరిగా నిద్రపోని వారు పగటి వేళ ఎక్కువగా కునుకుపాట్లు పడుతుంటారు. ఆ సమయంలో వాళ్లు డ్రైవింగ్‌లో ఉంటే.. 37 శాతం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

- రాత్రి వేళ నిద్రపోని వారు.. పగటి వేళలో తీవ్ర అలసటతో కనిపిస్తారని, నీరసంగా, బద్ధకంతో ఉంటారు.

- సర్వేలో పాల్గొన్న వారిలో అధిక శాతం నిద్ర రావటం లేదని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారి సగటు వయసు 35 సంవత్సరాలు. నిద్ర రాకపోవటంతో అలసటగా ఉందని 34 శాతం మంది చెబితే.. మరో 34 వాతం మంది అసహనంగా ఉందని చెప్పారు.

- నిద్ర సరిగా లేని కారణంగా డ్రైవింగ్ లో నిద్ర వస్తోందని 32 శాతం మంది చెబితే.. 27 శాతం మంది తలనొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. సరిగా నిద్ర లేకపోవటంతో ఏదీ ఆలోచించలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

- సర్వేలో పాల్గొన్నవారిలో 49 శాతం మంది గురక సమస్యలో బాధ పడుతున్నట్లు తేలింది. 12 శాతం మందిలో హైబీపీ ఉన్నట్లు గుర్తించారు.

- నిద్ర లేచిన తర్వాత కూడా ఫ్రెష్‌గా ఉండడం లేదని 42 శాతం మంది, పనిలో త్వరగా అలసిపోతున్నామని 25 శాతం మంది చెప్పారు.